ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రాతఃకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను భక్తిశ్రద్ధలతో విశేషంగా నిర్వహించారు. గురువారం పురస్కరించుకొని శ్రీ స్వామి వారికి తిరుప్పావడ సేవ వైభవంగా చేశారు. సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండడం. స్వామివారికి జరిపే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ అంటారని అర్చక స్వాములు తెలిపారు. ప్రతి గురువారం నైవేద్య సమయంలో తిరుప్పావడ జరుగుతుందని అప్పుడు సుమారు 450 కిలోల అన్నప్రసాదాన్ని, లడ్డు,వడ, తదితర పిండివంటలను శ్రీవారికి నైవేద్యం చేస్తారని చెప్పారు. సుమారు 3,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం శ్రీ స్వామి వారిని మాడవీధులలో శోభాయమానంగా ఊరేగిస్తూ, భక్తుల గోవింద నామస్మరణలతో, మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవ సేవను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు.