Take a fresh look at your lifestyle.

సింగరేణి అభివృద్ధిపై నిపుణుల కమిటీ

  • నాణ్యత ప్రమాణాలు పెంచి వినియోగదారులను నిలుపుకోవాలి.
  • నూతన గనులను సాధించుకోవడానికి కృషి చేయాలి.
  • పని సంస్కృతిలో మార్పునకు కార్మిక సంఘాల సహకారం తీసుకోవాలి.
  • కోలిండియా, సింగరేణి సమీక్షలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రానున్న రోజుల్లో ఇంధన రంగంలో స్వయం సమృద్ధిని సాధించే విషయంలో ప్రభుత్వ బొగ్గు సంస్థలు డిమాండ్‌కు తగినట్టు నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి  చేసేలా సమాయత్త పరిచేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నడుం కట్టింది.ఇందులో భాగంగా గురువారం ఢిల్లీలో కోలిండియా సహా సింగరేణిపై కీలక సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది.కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఢిల్లీ నుంచి జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఇందులో బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గింపు, నాణ్యత, సరఫరా తదితర అంశాల్లో ఎదురవుతున్న సవాళ్లు,వాటిపై తీసుకోవాల్సిన చర్యలపై  కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కీలక నిర్ణయాలు వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన సంస్థ అభివృద్ధి సంస్కరణలపై మాట్లాడారు. కార్మికుల జీతాలు,సంక్షేమ కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బొగ్గు ఉత్పత్తి ఖర్చు గణనీయంగా తగ్గించాలన్నారు. ఇందుకోసం కార్మిక సంఘాల సహకారాన్ని తీసుకోవాలని,పని సంస్కృతి మెరుగుపరచాలని సూచించారు. ఉత్పత్తి ఖర్చు తగ్గింపునకు సింగరేణి అధికారులు, బొగ్గు మంత్రిత్వ శాఖ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఈ కమిటీ ప్రత్యక్షంగా క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుందని చెప్పారు. కమిటీ చేసే ఆచరణాత్మక సూచనలను వెంటనే అమలు జరిపి ఉత్పత్తి ఖర్చును తగ్గించాలని సూచించారు. అలాగే వినియోగదారులు సింగరేణి సంస్థకు దూరం కాకుండా ఉండాలంటే నాణ్యతపై కూడా దృష్టి పెట్టాలని కేంద్రమంత్రి సూచించారు.

బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్ మాట్లాడుతూ బొగ్గు సంస్థల మనుగడకు కొత్త గనులను పెంచుకోవడం అత్యంత అవసరమని చెప్పారు.ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం ద్వారా వినియోగదారులకు బొగ్గు ధర అందుబాటులోకి తీసుకురావొచ్చని అభిప్రాయపడ్డారు.దాంతో అంతిమంగా విద్యుత్ ఉత్పత్తి వ్యయం కూడా తగ్గి ప్రజలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఈ సమీక్షలో పాల్గొన్న సీఎండీ బలరామ్ సింగరేణి తరఫున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సింగరేణి సంస్థ ప్రగతి, భవిష్యత్తు ప్రణాళికలు తదితర అంశాలపై కూలంకశంగా వివరించారు.ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు డి.సత్యనారాయణ రావు(ఈ అండ్ ఎం), ఎల్వీ సూర్యనారాయణ రావు (ఆపరేషన్స్), కె.వేంకటేశ్వర్లు (పి అండ్ పి, పా), ఈడీ ఎస్డీఎం.సుభాని తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.