Take a fresh look at your lifestyle.

బీజేపీదీ రాజకీయ బడ్జెట్ … కేంద్ర బడ్జెట్​ లో రాజకీయ అవసరాలకు పెద్దపీట

  • తెలంగాణపై కేంద్రానిది సవితి ప్రేమ
  • బీజేపీ పాలిత రాష్ట్రాల‌కే బ‌డ్జెట్ కేటాయింపులతో విక‌సిత్ భార‌త్ ఎలా సాధ్యం?
  • కిషన్​ రెడ్డి, సంజయ్​ కుమార్​ కేంద్రమంత్రి పదవులకు రాజీనామా చేయాలి
  • తెలంగాణ అబివృద్ధి కోసం సీఎం,మంత్రులు ఒంటరి పోరు
  • నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ నిరసనలు 
  •  ట్యాంక్​ బండ్​ పై నిరసనలో టీపీసీసీ చీఫ్​, రాష్ట్ర మంత్రులు
ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్​ కేంద్ర బడ్జెట్ ను తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటుందని టీపీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ ఆరోపించారు. తన స్వార్ధ రాజకీయాల కోసం రాష్ట్రాలను విడదీస్తూ జాతి సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్రబడ్జెట్​ లో జరిగిన కేటాయింపులే తెలంగాణ సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ఆ పార్టీ వివక్ష, రాజకీయ కక్షకు నిద‌ర్శ‌నమన్నారు. కేంద్ర బడ్జెట్​ కేటాయింపుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం, వివక్షకు నిరసనగా టీపీసీసీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్​ లోని ట్యాంక్​ బండ్​ పై కాంగ్రెస్​ శ్రేణులు భారీ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్​ మాట్లాడుతూ.. బడ్జెట్ లో కేంద్రం దేశ సమ్మిళిత వృద్ధిని కొంచెం కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ పట్ల సవితి ప్రేమ చూపుతోన్నకేంద్రం..రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఏమాత్రం సహకరించడం లేదని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల‌కే బ‌డ్జెట్ కేటాయిస్తే.. విక‌సిత్ భార‌త్ ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు.
దేశ జీడీపీలో 5.1శాతం వాటా ఉన్న‌ తెలంగాణకు  2.10 శాతమే తిరిగి వ‌స్తోందన్నారు. తెలంగాణ నుంచి  జీఎస్టీ, ఇతర పన్నుల రూపంలో  సుమారు రూ.లక్ష వేల కోట్లు వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కనీసం రూ.40 వేల కోట్లు తిరిగి ఇవ్వ‌క‌పోవ‌డం బాధాక‌రమన్నారు. బడ్జెట్ లో విభ‌జ‌న‌ చట్టం హామీలు, మెట్రో రెండో దశకు నిధుల కేటాయింపు తో పాటు ఇతర వాటికి కేటాయింపులు చేయలేదని మండిపడ్డారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అని గొప్పలకు పోయే బీజేపీకి దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలు,వారి సమస్యలు కనపడకపోవడం విడ్డూరమన్నారు. 2025-26 బ‌డ్జెట్ కేటాయింపులు చూసి తెలంగాణ ప్రజలు బీజేపీని ఎప్పటికీ క్షమించరన్నారు. తెలంగాణ  అభ్యున్న‌తి కోసం రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌తి తెలంగాణ పౌరుడు ఏక‌తాటిపైకి రావాలిసిన అవ‌స‌రం ఉందని టీపీసీసీ చీఫ్​ పిలుపునిచ్చారు. కేంద్రం క‌క్షపూరిత‌ వైఖ‌రికి నిర‌స‌న‌గా బీఆర్ఎస్,తెలంగాణ‌వాదులు ముందుకు రావాలన్నారు. మాటిమాటికి ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్‌,బీజేపీ  నేత‌లు సీఎం రేవంత్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ను విమ‌ర్శిస్తారన్న మహేశ్​ కుమార్​ గౌడ్​.. ఇప్పుడు బ‌డ్జెట్ కేటాంయిల‌పై స‌మాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర నిధుల కోసం సీఎం రేవంత్, మంత్రులు ఢిల్లీకి వెళ్లి ప్ర‌ధానమంత్రిని క‌లిసి యాచించినా తెలంగాణ‌కు ఒరిగింది ఏమి లేదన్నారు. కేంద్ర కేబినెట్​ లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న కేంద్రమంత్రులు బండి సంజయ్,కిషన్ రెడ్డికి రాష్ట్ర అభివృద్ధి గురించి పట్టదా అని నిలదీశారు. తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి కేంద్రమంత్రి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం సీఎం రేవంత్, మంత్రులు ఒంటరి పోరాటం చేస్తున్నారని చెప్పారు. 
రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కేంద్ర నిధులు, బడ్జెట్​ కేటాయింపుల విషయంలో బీజేపీ తెలంగాణ పై విద్వేషం చూపుతుందని ఆరోపించారు. బీజేపీ ఎంపీలలో తెలంగాణ డీఎస్​ఏ ఉంటే ఇప్పటికైనా రాష్ట్రాభివృద్ధి కోసం నిధులు డిమాండ్​ చేసి సాధించాలన్నారు. కేంద్రాన్ని పదేళ్లు నిధులు అడగడం లేదని ఇన్నాళ్లు చెప్పుకొచ్చిన తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. రాష్ట్రాలు అన్ని కలిస్తేనే యూనియన్ బడ్జెట్ అవుతుందని వ్యాఖ్యానించారు. 
రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కేంద్రంలో మూడు సార్లు అధికారం లోని వచ్చినా విభజన చట్టం లోని హామీలు అమలు చేయలేదని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్​ లో తెలంగాణకు నిధుల కేటాయింపులో బీజేపీ తన మార్క్​ చాటుకుందన్నారు. రాష్ట్రాభివృద్ధికి నిధులు కావాలని సీఎం, డిప్యూటీ సీఎం, సహచర మంత్రులు అందరం అనేక సార్లు ఢిల్లీకి వెళ్​లి కేంద్ర మంత్రులు, ప్రధాని మోదీని అభ్యర్ధించినా చివరకు మొండి చేయి చూపారన్నారు. తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్తున్న పన్నులను దృష్టిలో పెట్టుకొని నిధులు కేటాయించాల్సి ఉన్నా..మోదీ సర్కార్​ పట్టించుకోలేదన్నారు. రెండ్రొజుల క్రితం బీజేపీ ప్రవేశపెట్టింది స్వార్ధ బడ్జెట్ అన్నారు. తెలంగాణ అంటే బీజేపీ కి విధ్వేషమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు బీజేపీ చేష్టలు, అన్యాయాలను గుర్తించాలన్నారు. తన ఉన్న నిధులతోనే కాంగ్రెస్​ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు. బీజేపీ నేతలు అయోధ్య నుంచి అక్షింతలు పంచడం తప్ప అభివృద్ధి కి నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. అక్షింతలకు ఓట్లు వేద్దామా.. అభివృద్ధికి ఓటు వేద్దామ ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.  అంతకు ముందు ట్యాంక్​ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహనికి టీపీసీసీ చీఫ్​, మంత్రులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. తర్వాత వారి సమక్షంలో పార్టీ శ్రేణులు ప్రధాన మంత్రి, ఆర్ధిక మంత్రి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఈ ధర్నా లో ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్సీ లు వెంకట్, ఎగ్గే మల్లేశం, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ గణేష్, ఈర్లపల్లి శంకర్, నాగరాజు,  డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ లు మెట్టు సాయి కుమార్, మల్రెడ్డి రాంరెడ్డి, చల్ల నర్సింహారెడ్డి, ప్రీతమ్, రియాజ్, మహిళ కాంగ్రెస్ చీఫ్ సునీత రావ్, సామ రాంమోహన్ రెడ్డి, యూత్ అధ్యక్షులు,ఎన్​ఎస్​ యుఐ అధ్యక్షులు శివ చరణ్ రెడ్డి, వెంకట్ స్వామి, సేవాదల్ చైర్మన్ జితేందర్, నియోజక వర్గ ఇంచార్జ్ లు పాల్గొన్నారు.
నేడు జిల్లా కేంద్రాల్లో నిరసన !
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పై వివక్ష చూపి నిధుల కేటాయింపులో అన్యాయం చేసిన బీజేపీ వైఖరికి నిరసనగా నేడు అన్ని జిల్లా కేంద్రాలలో భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణ కు జరిగిన అన్యాయంపై గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఇందులో కాంగ్రెస్​ శ్రేణులతో పాటు అన్ని వర్గాల ప్రజలు, పార్టీల కతీతంగా నాయకులు పాల్గొనాలని కోరారు. ఈనిరసన కార్యక్రమాల్లో జిల్లాలోని ఎంపీలు,ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ లు, పోటీ చేసిన అభ్యర్థులు, అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఆదేశించారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దిష్టిబొమ్మలను దగ్దం చేయాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.