Take a fresh look at your lifestyle.

Khammam: 11వ తేదీ తర్వాత మీ సంగతి తేలుస్తా-ఏదులాపురం ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి

కారుకూతలు కూస్తే బొక్కలోకి పంపుతా
ముద్ర, ఖమ్మం :
ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పూర్తయిన వెంటనే హద్దులు దాటిన ప్రతి ఒక్కరి లెక్క తేలుస్తానని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రత్యర్థులను హెచ్చరించారు. రాజకీయాల ముసుగులో అరాచకాలు చేస్తామన్నా… ఫోన్లలో బెదిరింపులకు దిగినా సహించేది లేదని స్పష్టం చేశారు. చందాలు, దందాలు చేస్తే కింద పడుద్ది జాగ్రత్త అన్నారు. తింగరి వేషాలు వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదనీ చట్టప్రకారం మీ అందరినీ బొక్కలో వేయించడం ఖాయమన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్డులో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. ఎవరైనా కారుకూతలు కూస్తే చట్టరీత్యా ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరన్న పొంగులేటీ… మీ దందాలకు, దౌర్జన్యాలకు ప్రజలు ఈ ఎన్నికలతో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారని చెప్పారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని ఆకాంక్షించిన మంత్రి.. అశాంతి సృష్టించాలని చూస్తే ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.

అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వ సాయం ఉండాలనీ అధికారంలో ఉన్న తామే ఆ పనులు చేయగలమని మంత్రి చెప్పారు. ఏ అధికారం ఉందని మీరు మేలు చేస్తామంటూ ప్రజల వద్దకు వస్తున్నారని ప్రత్యర్థులను నిలదీశారు. పదేళ్లు అధికారంలో ఉన్న ఆ ‘దొర’లకు పేదలకు ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే కొత్త రేషన్ కార్డులు, హాస్టల్ విద్యార్థులకు డైట్ చార్జీల పెంపు వంటి ఎన్నో సంక్షేమ ఫలాలను అందించామని గుర్తుచేశారు. ఏప్రిల్ నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేపడతామని మంత్రి ప్రకటించారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇచ్చే బాధ్యత తనదేనన్న పొంగులేటి… ఏదులాపురాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. మున్నేరు వరద బాధితులకు అండగా ఉన్నామని, వచ్చే వర్షాకాలం నాటికి రిటైనింగ్ వాల్ పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.