- నిందితుడు ప్రభాకర్ గదిలో మూడో గన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
- గతంలో విశాఖ జైలులో ఉన్న నిందితుడు ప్రభాకర్
- అక్కడ తనను చిత్రహింసలు పెట్టిన తోటి ఖైదీని చంపేందుకు కుట్ర
ముద్ర, తెలంగాణ బ్యూరో : గచ్చిబౌలి ప్రిజం పబ్ వద్ద జరిగిన కాల్పుల ఘటన కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు బత్తుల ప్రభాకర్ అలియస్ రాహుల్ రెడ్డి విశాఖపట్నంలో తనతో పాటు జైలులో ఉన్న ఖైదీని హతమార్చేందుకు బీహార్ రాష్ట్రంలో తుపాకులను కొన్నట్లు పోలీసులు గుర్తించారు. జైలులో తనను చిత్రహింసలు పెట్టిన తోటి ఖైదీని చంపేందుకు ప్రభాకర్ కుట్రపన్నాడు. ఈ మేరకు ఆదివారం మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియాకు వివరాలను వెల్లడించారు. ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన అంతర్ రాష్ట్ర మోస్టువాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌ను శనివారం సాయంత్రం గచ్చిబౌలి ప్రిజం పబ్ వద్ద సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. ప్రిజం పబ్ సమీపంలోని ఘటనా స్థలంలో ప్రభాకర్ నుంచి రెండు తుపాకులు, 23 బులెట్స్ స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరించారు. హైదరాబాద్లో ప్రభాకర్ ఉంటున్న రూమ్లో మరొక గన్తో పాటు 428 బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుడు నుంచి చోరీకి ఉపయోగించే పరికరాలు సీజ్ చేశామన్నారు.
ఏపీ, తెలంగాణాలో చోరీలకు సంబంధించి మొత్తం 80 కేసులలో ప్రభాకర్ నిందితుడని డీసీపీ వినీత్ వెల్లడించారు. పాత నేరస్థుడైన ప్రభాకర్ తెలంగాణలోని 11 కేసుల్లోనూ, ఏపీలోని 12 కేసుల్లోనూ మోస్టు వాంటెడ్‌గా ఉన్నాడని తెలిపారు. 2022 మార్చిలో విచారణ నిమిత్తం ఏపీలోని అనకాపల్లి కోర్టుకు తీసుకెళ్ళిన సమయంలో తప్పించుకుని పారిపోయాడని, అప్పట్నుంచీ పరారీలో ఉన్నాడని తెలిపారు. 2013 నుంచి నేరాలకు అలవాటు పడిన ప్రభాకర్‌కు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాతో సంబంధాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో నేరాలకు ప్రభాకర్ నేరాలకు పాల్పడ్డాడని, దొంగతనాలతో దోచుకున్న సొమ్ముతో విలాసవంతమైన జీవితం గడపడం నిందితుడు ప్రభాకర్‌కు అలవాటని అన్నారు. ఇళ్ళలో దోచుకోవడం రిస్క్ అని భావించిన ప్రభాకర్ హైదరాబాద్ నగర శివార్లలో ఉండే యూనివర్సిటీలనే టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడేవారని డీసీపీ వినీత్ తెలిపారు. ప్రభాకర్ దొంగతనం చేసే ముందు రెక్కీ చేస్తాడని, అతర్వాత పోలీసులకు చిక్కకుండా ఎలా తప్పించుకోవాలో యూట్యూబ్‌లో వీడియోలు చూస్తాడని తెలిపారు. గతంలో విశాఖ జైలులో ఉన్నప్పడు ఓ ఖైదీతో గొడవపడి ఆతనిపై కక్షను ప్రభాకర్ పెంచుకున్నాడని, అతన్ని చంపాలనే ఉద్దేశంతో తోటి ఖైదీల సహాయంతో బీహార్‌లో గన్‌లను కొనుగోలు చేశాడన్నారు. ప్రభకర్ గన్‌లను కొనుగోలు చేయడానికి సహకరించిన వారందరీ అరెస్టు చేస్తామని డీసీపీ వినీత్ తెలిపారు. నిందితుడు ప్రభాకర్ జరిపిన కాల్పుల్లో గాయపడిన హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, రెండు నెలల్లో ఆయన కోల్కొంటారని వైద్యులు తెలిపారని డీసీపీ వినీత్ వెల్లడించారు.