ఇందిరమ్మ ఇళ్లకు బదలాయింపు
పెండింగ్ బిల్లులు చెల్లింపు
ప్రభుత్వం నిర్ణయం.. మార్గదర్శకాలు జారీ
ముద్ర, తెలంగాణ బ్యూరో :
గృహలక్ష్మి పథకం కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొందరు పేదలు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ఇళ్ల నిర్మాణాలు ఆగిపోగా.. వాటికి ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తింపజేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. తాజాగా.. బిల్లుల చెల్లింపుపై మార్గదర్శకాలు విడుదల చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు గృహలక్ష్మి పథకం అమలు చేసిన సంగతి తెలిసింది. 2023లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద పలువురు లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. కొందరు లబ్ధిదారులకు అప్పటి మంత్రులు, ఎమ్మెల్యే మంజూరు పత్రాలు సైతం అందించారు. దీంతో పలువురు లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులు మెుదలుపెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా.. ఆ పథకాన్ని రద్దు చేశారు. దాని స్థానంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద పేదల ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారు.
అయితే గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు మాత్రం బిల్లులు చెల్లించలేదు. దీంతో ఏళ్లుగా ఆయా లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా వారి నిరీక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. మొండిగోడలు, పిల్లర్లతో దర్శనమిస్తున్న గృహలక్ష్మి నిర్మాణాలకు ఊపిరి పోయాలని నిర్ణయించారు. మధ్యలోనే నిలిచిపోయిన ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నాళ్లు నిధులు లేక నిలిచిపోయిన గృహలక్ష్మి ఇళ్లకు తాజా ఉత్తర్వుల మేరకు ఆర్థిక సాయం సమకూరుతుంది. ఫలితంగా గత మూడేళ్లుగా పునాదులకే పరిమితమైన ఇళ్లు నివాసయోగ్యమైన గృహాలుగా మారనున్నాయి.
ఇవే మార్గదర్శకాలు
అయితే క్షేత్రస్థాయిలో అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు ఇందిరమ్మ పథకానికి ఎంపిక చేస్తారు. ఇందిరమ్మ ఇళ్ల మార్గదర్శకాల ప్రకారం.. పునాది ప్రాంతం 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల మధ్యనే ఉండాల్సి ఉంటుంది. గృహలక్ష్మి లబ్ధిదారుల ఇప్పటికే నిర్మించిన బేస్‌మెంట్ తక్కువగా ఉంటే దానిని కనీసం 400 చదరపు అడుగులకు తేవటానికి అదనపు పునాది బీమ్‌లను వేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద బేస్‌మెంట్ వేసినట్లయితే దాన్ని గరిష్ఠంగా 600 చదరపు అడుగులకు పరిమితం చేయాలి. నిర్మాణాన్ని ఇప్పటికే బేస్‌మెంట్ తీసుకెళ్లిన దృష్ట్యా వారికి ఆ దశ డబ్బులు చెల్లించరు. అయితే బేస్‌మెంట్ తర్వాత మిగిలిన రూ.4లక్షలు దశల వారీగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. రూఫ్ లెవల్ రూ.లక్ష, స్లాబ్ పూర్తయితే మరో రూ.2లక్షలు, ఫినిషింగ్ రూ.లక్ష చొప్పున గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు అందిస్తారు.