Take a fresh look at your lifestyle.

ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ఆరాటం

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల నిధుల్లో భారీగా కోతలు
కమీషన్ల ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించాలి
సనాతన ధర్మం మీద దాడులను సహించబోం
బీజేపీ జాతీయ నేత నితిన్ నబీన్

ముద్ర, మహబూబ్ నగర్ :

దేశం, రాష్ట్రంలో ముస్లిం ఓటు బ్యాంకు కోసమే కాంగ్రెస్ నేతలు ఆరాటపడుతున్నారని బీజేపీ జాతీయ నేత నితిన్ నబీన్ ఆరోపించారు. కొన్ని వర్గాలను సంతృప్తిపర్చేందుకే ప్రయత్నం చేస్తున్నారన్న ఆయన కాంగ్రెస్ పాలనలో బలహీనవర్గాలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల నిధుల్లో భారీగా కోతలు విధిస్తోన్న కాంగ్రెస్.. సర్కార్ వక్ఫ్ బోర్డులను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బుధవారం మహబూబ్‌నగర్‌ లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. పలుచోట్ల హిందూ దేవాలయాలపై బహిరంగంగా దాడులు జరుగుతున్నా ఎవరూ నోరు మెదపట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఆలయ భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడులను ఏమాత్రం సహించబోమన్నారు. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో అన్నింటా విఫలమైందని ధ్వజమెత్తారు. రైతుభరోసా, రుణమాఫీ, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు. ఎస్సీలు, ఆదివాసీలు, బీసీలను ప్రభుత్వం నిలువునా మోసం చేసిందన్నారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే బీజేపీని గెలిపించాలని నితిన్ నబీన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కమీషన్ల పేరుతో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి పనులు, బిల్లుల మంజూరుకు చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా ఆర్ఆర్ ట్యాక్స్ కట్టాల్సిన దుస్థితి దాపురించిందని అన్నారు. ఈ అవినీతి, కమీషన్ల ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించాలని నితిన్ నబీన్ ప్రజలకు పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.