- మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్.
మధిర, ముద్ర విలేఖరి : రాజ్యాంగంలోని సూత్రాలు శాసనసభలో చేసే చట్టాల ఉల్లంఘన జరిగినప్పుడు న్యాయ వ్యవస్థ కచ్చితంగా న్యాయ సమీక్ష చేయాల్సిందేనని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి . చంద్రకుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. స్థానిక రిక్రియేషన్ క్లబ్ లో శనివారం ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్ (ఐఏఎల్) ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయవాదుల శిక్షణా తరగతుల కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ఆర్ట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్ ఇన్ క్రిమినల్ కేసెస్, ప్రొఫెషనల్ ఎథిక్స్ తదితర అంశాలపై న్యాయవాదులకు అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్యంలో శాసనసభ, న్యాయవ్యవస్థ, కార్యనిర్వహక శాఖలలో ఎవరి పాత్ర వారికే ఉంటుందని ఒకరి పాత్రలోకి మరొకరు చొచ్చుకుపోకూడదన్నారు. శాసన సభ లో ఆమోదం పొంది వచ్చే చట్టాలు ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలని, లేని యెడల ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందన్నారు.న్యాయ సమీక్ష అధికారం కోర్టులకు లేనప్పుడు న్యాయ వ్యవస్థ యొక్క రూపం ప్రజాస్వామ్యంలో కనుమరుగైపోతుందన్నారు. కంప్యూటర్ కాలంలో కూడా భారతదేశంలోని ప్రజలు కోర్టులపై నమ్మకాన్ని పోగొట్టుకోలేదని కొన్ని సందర్భాలలో నిరూపణ అయిందన్నారు. ఎప్పుడైతే శాసన కార్యనిర్వాహక శాఖలు న్యాయవ్యవస్థలోకి చొచ్చుక వచ్చి ప్రభావితం చేయాలని చూస్తాయో అప్పుడు ఆ మూడింటి మధ్య ఉన్న సంబంధం తెగిపోతుందన్నారు. న్యాయ వ్యవస్థకు, విలువలకు విడదీయరాని బంధం ఉందన్నారు. నిజాయితీ, విలువలకు కట్టుబడి ఉన్న వ్యక్తులను న్యాయవ్యవస్థ నెత్తిన పెట్టుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంతో పోల్చితే ప్రస్తుత యువతరం న్యాయవిద్యను చదవటానికి ముందుకు రావటం హర్షించదగ్గ విషయమన్నారు. ఎంతమంది యువ న్యాయవాదులు న్యాయవృత్తిలోకి వస్తే అంత త్వరగా కేసులు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.మానవ సంబంధాలు, విలువలు క్రమేణ దూరమవుతున్న ఈ రోజుల్లో న్యాయవాదులు ఉన్నత విలువలతో అందరికీ స్ఫూర్తిని ఇవ్వాలన్నారు. ప్రస్తుతం న్యాయవ్యవస్థ అత్యంత ఖరీదైనదిగా మారిందని సామాన్యుడు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి లేదన్నారు. వివాహ బంధాలను తెగ తెంపులు చేసుకునే కేసులు కోర్టులకు ఎక్కువ రావడం దేశానికి మంచిది కాదన్నారు.తద్వారా వివాహ వ్యవస్థ నాశనమై భారతదేశ సారూప్యత దెబ్బతింటుందన్నారు.న్యాయవాదులకు ప్రజా సంబంధాలు అవసరమన్నారు.సమాజ అభివృద్ధికి చట్టం తోడ్పడుతుందని న్యాయవాదులు బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగించాలని, పేదల నివసించే ప్రాంతాలకు వెళ్లి వారికి న్యాయ పరిజ్ఞానాన్ని కల్పించాలని, కార్మికులకు వారి హక్కుల గురించి తెలియజేయాలన్నారు.క్రాస్ ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుతూ డిఫెన్స్ లాయర్ ఒక పరిశోధకుడిగా న్యాయపరమైన అన్ని విషయాలు తెలిసి ఉండేలా కేసులను అధ్యయనం చేయాలన్నారు.కేసుల పరిష్కారానికి రాజీనే సరైన మార్గం అన్నారు.తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ దుస్స జనార్దన్ మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ కోసం చట్టం తీసుకురావాల్సిందేనన్నారు.లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, బార్ కౌన్సిల్ పై ఉందన్నారు.వృత్తిలో న్యాయవాదుల మెలుకులు తెలపటానికి, నైపుణ్యతను పెంచడానికి శిక్షణా తరగతులను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.సీనియర్ న్యాయవాది మామిడి హనుమంతరావు మాట్లాడుతూ నూతనంగా మారిన చట్టాలైన, భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ సాక్ష్య అధికారనియం 2023 చట్టాల వలన నేరస్తులు తప్పించుకునే అవకాశం లేదన్నారు.ఈ చట్టాలు పోలీసులకు ఎక్కువగా ఉపయోగపడే అవకాశాలున్నాయన్నారు. పోలీసులు ఒకవేళ మరో దృష్టి కోణంతో ఆలోచిస్తే సామాన్యుడికి ఈ చట్టాల వలన నష్టం చేకూరుతుందన్నారు. టెక్నాలజీకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎలక్ట్రానిక్ సాక్షాలను కూడా ప్రధాన సాక్షాలుగా గుర్తించే కారణంగా నేరస్తులు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరన్నారు . శిక్షణా తరగతులకు ప్రారంభానికి ముందు మధిర ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ వేముల దీప్తిని ఐఏఎల్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై ఉదయ భాస్కర్, సహాయ కార్యదర్శి పి. పట్టాభి, సీనియర్ నాయకులు వాసిరెడ్డి వెంకటేశ్వరావు , ఐఏఎల్ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేక్ లతీఫ్, ఓరుగంటి శేషగిరిరావు, కొత్తగూడెం జిల్లా కార్యదర్శి భాగం మాధవరావు, జిల్లా గౌరవ అధ్యక్షులు పారుపల్లి అమర్ చంద్, రాష్ట్ర నాయకులు కోటం రాజు, మునిగడప వెంకటేశ్వర్లు, ఖమ్మం బార్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ శాంత కుమారి, ఐఏఎల్ జిల్లా ఉపాధ్యక్షులు తెల్లప్రోలు వెంకటరావు, కావూరి రమేష్, షేక్ ఇమావళి,నెల్లూరి రవికుమార్, గంధం శ్రీనివాసరావు మహిళా కార్యదర్శిలు షేక్ నస్రీన్, అరుణ, మధిర బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోజెడ్ల పుల్లారావు, జింకల రమేష్, ఐఏఎల్ ఖమ్మం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీనారాయణ, ఈ.సతీష్, కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు, ఉప్పిశెట్టి సునీల్ తదితరులు పాల్గొన్నారు.
