జరిమానాలు పెంచి, పోలీసులకు టార్గెట్లు
అకౌంట్ల నుండి డబ్బులు కట్ చేసే నిర్ణయాన్ని మార్చుకోవాలి
ఏడాదిలో రూ. 108.33 కోట్ల నుంచి రూ. 275.05 కోట్లకు పెరిగిన చాలానా వసూళ్లు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆటోమేటెడ్ దోపిడీ’ కి తెరలేపిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. చలానాల మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల నుండి కట్ చేసే ‘ఆటో-డెబిట్’ విధానంపై సీఎం చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. ముందుగా జరిమానాలు పెంచి, ఆపై పోలీసులకు టార్గెట్లు పెట్టి, ఇప్పుడు నేరుగా అకౌంట్ల నుండి డబ్బులు కట్ చేయాలని చూడటం ‘ఆటోమేటెడ్ దోపిడీ’ లా ఉందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాలను పునరాలోచించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ట్రాఫిక్ చలాన్ల ఆదాయం భారీగా పెరగడంపై స్పందించిన బండి సంజయ్… రాష్ట్రంలో సాగుతుంది ‘ప్రజా పాలన’ కాదు.. ‘పెనాల్టీ పాలన’ అని సోమవారం ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. కేవలం ఏడాది కాలంలోనే చలానాల వసూళ్లు రూ. 108.33 కోట్ల నుంచి రూ. 275.05 కోట్లకు పెరగడాన్నికేంద్ర మంత్రి ప్రశ్నించారు. ఏడాది కాలంలోనే జరిమానాల ద్వారా వచ్చే ఆదాయం 154 శాతం అంటే దాదాపు 2.5 రెట్లు పెరిగిందని గణాంకాలతో వివరించారు. చలానాల ద్వారా వసూళ్లు 2.5 రెట్లు పెరిగినప్పుడు, రాష్ట్రంలో రోడ్లు కూడా అదే స్థాయిలో మెరుగుపడ్డాయా అని బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రోడ్లపై గుంతలు మాయమయ్యాయా, ట్రాఫిక్ నిర్వహణ ఏమైనా మెరుగైందా అని నిలదీశారు. ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండా కేవలం జరిమానాలపైనే ప్రభుత్వం దృష్టి పెట్టడం సరికాదన్నారు. సామాన్య ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ‘వాకింగ్ ఏటీఎం’లా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు.