ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.మనిషి ఆరోగ్యంగా ఉండగలిగినపుడే శ్రమతో స్వేదం చిందించి సంపదను సృష్టించగలుగుతాడు.అలా సృష్టించిన సంపదనే కుటుంబం మరియు సమాజ అవసరాలకు, శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది. ఆ సంపద సృష్టించే మనిషే అనారోగ్యానికి గురై తే చికిత్సల కోసం అవస్థలు పడుతుంటే ఆర్థిక ఎదుగుదల గానీ ఇతరత్ర అభివృద్ధి గానీ జరగక పోగా కుంటుపడుతుంది. మనుషులు బతకడానికి అవసరమైన పీల్చే గాలి ,తాగే నీరు, తినే ఆహారం సర్వం కల్తీ మయమైన పరిస్థితి సమాజంలో నెలకొనివుంది . ప్రజారోగ్యానికి దోహదం చేసే ప్రకృతి వనరులు కాలుష్యానికి గురి కావడం,మనుషులు నిత్యజీవితంలో ఉపయోగించే ఆహార పదార్థాలు రకరకాలుగా కల్తీ కావడం వలన ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కట్టడి చేయాల్సిన కల్తీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తున్న వైనంపై అరికట్టే చర్యలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి.
మనుషులు తమ తమ పనుల ఒత్తిడుల వల్ల బయట ఆహారాలపై ఆధారపడటం వలన ఆహారపదార్థాల కల్తీ నిరాటంకంగా కొనసాగుతోంది. ఫలితంగా ఏటా ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. ప్రజలను వివిధ రకాల రోగాలకు, అనారోగ్యాలకు కారణమవుతున్న కల్తీ దందాపై ప్రభుత్వాల నియంత్రణ పూర్తి స్థాయిలో లేక మనుషులుగా మనం ఉపయోగించే ప్రతి వస్తువు కల్తీ మయమే :’ఇందుగలదందులేదను సందేహం వలదు’అన్నట్లుప్రజలు తప్పక ఉపయోగిస్తారనుకునే ఏ పదార్థాల్లో నైనా కల్తీ జరుగుతోంది. మనం వాడే నిత్యావసరవస్తువులు,ఆహారపదార్థాలు కల్తీమయమవుతున్నాయి. మార్కెట్లో ఏ వస్తువైనా మంచిది ఇవ్వమంటే నంబర్ వన్నా, నంబర్ టూ అంటూ రెండు మూడు రకాలవి చెబుతున్నారు. ఎక్కువగా ఏ వస్తువు కైతే డిమాండ్ ఉండి ధర ఎక్కువగా ఉంటుందో ఆ వస్తువును అక్రమార్కులు అధికంగా కల్తీ చేస్తున్నారు.
నూనె ప్రతి ఇంట్లోచేసే వంటకాల్లో నిత్యావసరంగా తప్పనిసరిగా నూనెలు వాడుతుంటారు.పెళ్ళిళ్ళు వంటి శుభకార్యాలలో ఇంకా ఎక్కువగా ఉపయోగిస్తారు. గతంలో పల్లి నూనె , నువ్వుల నూనె గ్రామాల్లో సైతం గానుగ పట్టించేవారు. ప్రస్తుతం ఫిల్టర్ ఆయిల్ పేరిట,రిఫైండ్, డబుల్ రిఫైండ్ లో పేర్లతో పల్లి నూనె, నువ్వుల నూనె ,పొద్దు తిరుగుడు నూనె ,పామాయిల్ , ఆలివ్ , రైస్ రిచ్ ఆయిల్లాంటివి ఆకర్షణీయమైన ప్యాకెట్ల తో మార్కెట్లో కి వచ్చాయి.చౌకధరల్లో లభించే నూనెలు పల్లి , నువ్వుల నూనెల్లో కలిపి అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.అలా చేయందే ఆ ధరలకు ఆ నూనెలు అమ్మడం కుదరదంటున్నారు. మిల్లుల గానీ,గానుగల గానీ పల్లి నూనె పట్టిస్తే ఒక లీటర్ కి 500 రూపాయలు ఖర్చు అవుతుంటే రిఫైండ్ ఆయిల్ ప్యాకెట్ 200 రూపాయలలోపే లభిస్తుంది . కల్తీ లేని నాణ్యత గల నూనె ధర ఎక్కువగా ఉండగా , కల్తీమయమైన నూనె చౌకగా దొరుకుతున్నందున తక్కువ ధరకు లభించేదే జనాలు ఉపయోగిస్తారు. బ్లెండెడ్ వెజిటబుల్ ఆయిల్ పేరుతో రెండు రకాల నూనెలను కలిపి అమ్ముతున్నారు. మనుషుల ఆరోగ్యాలపై దుష్ప్రభావాలను ఏర్పరిచే కల్తీ పదార్థాలను నియంత్రించాల్సిన అవసరము ఎంతో ఉంది . పెద్ద పెద్ద హోటళ్ళలో చౌకగా లభించే నాణ్యతలేని నూనెలు ,జంతు కళేబరాలతో చేసిన నూనెలు టిన్నుల్లో తెచ్చి వినియోగిస్తున్నారు.ఇదొకవైపు ఇలా జరగ్గా ఫాస్టుఫుడ్ సెంటర్లు, ఉదయం టిఫిన్ సెంటర్లు, సాయంత్రం మిర్చి,బజ్జీల బండ్లలో ఒక్కసారి వాడాల్సిన నూనెనే మళ్ళీమళ్ళీ మరిగించి వాడటంతో హానికరంగా మారి ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు అంటున్నారు.
ఆహార పదార్థాల కల్తీ::
చిన్న చిన్న హోటళ్ళు మొదలు కొని ధాభాలు,పెద్దపెద్ద రెస్టారెంట్లు , ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో సప్లై చేసే ఆహారపదార్థాలు కల్తీ చేయడం మామూలైపోయింది. కూరల్లో రుచి కొరకు ఫ్లేవర్స్, ఫుడ్ కలర్స్, సాస్ లాంటివి కలుపుతున్నారు. న్యూడుల్, ఫ్రైడ్ రైస్,రుచికరమైన కూరల్లో వెనిగర్ ,మైదా, సింథటిక్ గమ్ ,రెడాక్సైడ్ లాంటివి కలుపుతున్నారని పరీక్షల్లో తేలింది . కాలం చెల్లిన వాటిని రీసైకిలింగ్ చేసి వినియోగిస్తున్నారు.అల్లం,వెల్లుల్లి పేస్టులు కల్తీవే.గతంలో దేశంలో చేసిన సర్వే అధ్యయనంలో కల్తీ దందా చేస్తున్న 19 టాప్ సిటీలో హైదరాబాద్ మొదట్లోనే ఉంది తర్వాత బెంగళూరు చెన్నై లు ఉన్నాయి . దేశంలోనే హైదరాబాద్ ఆహార పదార్థాలు సరఫరా చేసే ఆరవ అతిపెద్ద నగరం . ఇది వేల కోట్ల రూపాయల వ్యాపారం . రాజధాని నగరమే కాక ఆయా జిల్లాల్లోని వరంగల్, కరీంనగర్ ,నిజాంబాద్ ,నల్గొండ ,సూర్యాపేట , ఖమ్మం తదితర పెద్ద పట్టణాలతో పాటు జిల్లా కేంద్రాలు,ఇతర చిన్న చిన్న పట్డటణాలు, మండలం కేంద్రాలు , గ్రామాల్లోని హోటళ్ళు రాష్ట్రం అంతటా ఇదే తంతు . డబ్ల్యు హెచ్వో సర్వేలో ప్రతి ఏటా కల్తీ ఆహారంతో నాలుగు లక్షల 20వేల మంది చనిపోతున్నారని తెలిపింది. కోట్లాది మంది అనారోగ్యాలతో , ఆస్పత్రుల పాలవుతున్నారు..
ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాదులో గతంలో చేసిన తనిఖీల్లో 62 శాతం హోటళ్ళలో పాడైన,కల్తీ చేసిన ఆహారాన్ని సరఫరా చేస్తున్నట్లు తేల్చారు.వేరే రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు ధరకు వచ్చే వేస్ట్ చికెన్ రెస్టారెంట్లో అందిస్తున్నట్లు తేలింది. కుళ్ళిన పదార్థాలు వాసన రాకుండా రసాయనాలు, ఫ్లేవర్స్, ఫుడ్కలర్స్ కలుపుతున్నట్లు తేలింది. స్వీట్లు ,కేకులు ప్రమాదకర రసాయనాలు కలిపి ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో వంటలు చేయడం వల్ల అనేకసార్లు బిర్యాని ,సాంబార్ లాంటి ఆహార పదార్థాల్లో పురుగులు రావడం జరుగుతూనే ఉంది. నిత్యం కూరల్లో వాడే పసుపులో మిఠాయి రంగు లేదా క్రోమేట్ కలిపి కల్తీ చేయటం వలన రక్తహీనత,అంధత్వం లాంటి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
” పప్పులు ‘ మనం
పిండి పదార్థాలకు ,వంటలకు ఉపయోగించే పప్పు దినుసులు నిగనిగా మెరిసి కళ్లకు మంచిగా కనపడేందుకు మిఠాయిలకు వాడే రంగులను,టాల్కం పౌడరు కలపడం వల్ల నాణ్యమైనదిగా భావించి వినియోగదారులు కొంటున్నారు. ‘ఫ్రూట్ జ్యూస్ ‘ పాడైన పండ్లను కలుషిత నీటితో తయారైన ఐస్ను వినియోగగిస్తున్పారు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఉపయోగించే పండ్లను పక్వానికి రాకముందే కాయలను తెంపి మగ్గ పెట్టడానికి రసాయనాలను ఉపయోగిస్తున్నారు. వాటర్ మిలాన్లు త్వరగా ఫక్వానికి వచ్చి లోపల ఎర్రగా కనిపింందుకు ఇంజెక్షన్లు ఇవ్వటం, ఆపిల్స్,దానిమ్మ ,అరటి,ఆరేంజ్ లాంటి పండ్లు నిగనిగ లాడతూ ఆకర్షణీయంగా కనబడటానికి రసాయన ద్రావకాలను కడగటం,లేదా పూయటం చేస్తున్నారు.. మెరుస్తూ కనపడితే బాగున్నాయనుకుని వినియోగదారులు కొంటుంటారు. ఆరోగ్యంగా ఉండాలని పండ్ల ను తిని అనారోగ్యాల బారిన పడుతున్నారు.
” మిరప్పొడి. “స్వీట్ల లోతప్ప అన్ని రకాల కూరల్లో ,చట్నీ లలో, ఉప్పు కారం తప్పనిసరిగా ఉపయోగిస్తారు . నాసిరకం ఎండుమిర్చి మరపట్టి కారంపొడి ఎర్రగా ,ఆకర్షణీయంగా కనిపించేందుకు కొన్ని రంగులను కలుపుతున్నారు. ఇటుక పొడి రంపపు పొట్టు, కొన్ని రంగులను కలిపి తయారుచేస్తున్నారు. ఆకర్షణీయ ప్యాకుల్లో విక్రయిస్తున్నారు.రెడీమేడ్ గా దొరికే వీటిని ఉపయోగించడం తో ఇతర అన్ని రకాల పొడులు ఇలానే కల్తీ చేస్తూరెడీమేడ్ ప్యాకుల్లో విక్రయించడం జరుగుతుంది..
కల్తీ విత్తనాలు- మందులు..
దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు కూడా కల్తీ తిప్పలు తప్పడం లేదు. అధిక దిగుబడి ఇస్తాయనీ మొక్క జొన్న, పత్తి ,వరి, మిర్చి తదితర విత్తనాల ప్యాకెట్లు అధిక ధరలకు కొనుగోలు చేసి సాగు చేస్తే ఏపుగా ,పచ్చగా వస్తుందనీ సంతోష పడుతు వచ్చిన రైతుకూ అసలు దిగుబడిలేక దిగాలు పడిన ఉదంతాలు ఎన్నో. పంట ఏపుగా వస్తుందనుకున్న దశలో రోగం రావడంతో మందులు తెచ్చి చల్లడం, పిచికారీ చేయగా అదీ కల్తీ మందు అని తేలడంతో గుండె చెదిరిన కుటుంబాలు ఎన్నో . విత్తనాలు , ఎరువులు నకిలీవి కావడంతో అప్పుల బారిన పడి వీధుల్లో పడిన కుటుంబాలు ఎన్నో. ఇలాంటి ఘటనలు జరక్కుండా అరికట్టాల్సిన అధికార యంత్రాంగం ఉన్నప్పటికీ మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూనే ఉన్నాయి. విడివిడిగా చూస్తే ఒకటి రెండు సంఘటనలే అన్పించినా ఆయా గ్రామాల, జిల్లా, రాష్ట్ర స్థాయి లో చాలా చాలా సంఘటనలు జరగడం మొత్తంగా ఆర్థికకంగా తీవ్ర నష్టం కల్గిస్తున్నాయి.
” పాల కల్తీ” పసి పిల్లలు మొదలుకొని పండు ముసలి వరకు తాగే పాలు సైతం దుర్మార్గమైన పద్ధతుల్లో కల్తీ చేస్తున్నారు.ఇదో పెద్ద వ్యాపారమైందనటంలో ఆశ్చర్యం లేదు.. గతంలో మంచి నాణ్యమైన, ఆరోగ్యకరమైన పాలు లభించేవి.ప్రస్తతం స్వచ్ఛమైన పాల మాట దేవుడెరుగు .. పాలల్లో నీరు కలపడం సహజమే కావచ్చు . కానీ పాలు లేకుండా పాలను తయారు చేయటం ఆశ్చర్యం.దుర్మార్గం . హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటి రసాయనాలతో పాలు తయారు చేయడం గేదెలకు ప్రమాదకర కృత్రిమ రసాయనాలతో ఎక్కువ పాలు ఇచ్చేట్లు ఇంజక్షన్ చేయడం ద్వారా పాలు అధికోత్పత్తి చేస్తున్నారు. గంజిపొడి ,సున్నం, ఫెవికాల్ , కాల్షియం కార్బైడ్ ,యూరియా లాంటి వాటితో పాలను కల్తీ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.ఫేక్ పన్నీరు సైతం విక్రయిస్తున్నారు .ఇలా పాలను తయారు చేసే ముఠాలు తెలుగు రాష్ట్రాల్లో సరా ఫరా చేస్తున్నట్లు గతంలో రాయల సీమలో సంబంధిత అధికారులు జరిపిన దాడుల్లో తెలిసిపోయింది.పాల ప్యాకెట్లు వాడాలంటే భయపడే పరిస్థితి ఉన్నప్పటికీ వినియోగించక తప్పటం లేదు. ఇలా ఒకటేమిటి ఏది చూసినా కల్తీ మయమే.ముఖ్యంగా అన్ని రకాల హోటళ్ళు,తినుబండారాలు,పాల లాంటివి కల్తీ జరుగుతోందనీ తెల్సినా అవసరాలు తీర్చే ప్రత్యామ్నాయాలు లేనందున అనివార్యంగా వాటినే వాడాల్సి వస్తుంది.దాంతో వాటిని అనగా కల్తీమయమైన వాటిని కొనుగోలు చేయటానికి డబ్బులు పెట్టాల్సి రావడంతో పాటు వాటి దుష్ప్రభావాల బారిన పడి అనారోగ్యాల బారిన పడి లక్షల రూపాయలు ఆస్పత్రుల్లో వెచ్చించాల్సిన పరిస్థితి.. దాంతో హోటళ్ళ లో తింటున్న వారి పరిస్థితిన హోటల్ టూ హాస్పిటల్ అన్న చందంగామారిన దుస్థితి.ఈ పరిస్థితి మారాలంటే కల్తీ నీ అరికట్డడ మొక్కటే మార్గం.
“కల్తీ నీ కట్టడి చేయాలి ప్రజారోగ్యాలకు భధ్రత ఇవ్వాలి. “
కొందరు ఒకటి రెండు సార్లే కదా అని రుచికరమైందని, ఆహార ప్రియులు ఏమవుద్దిలే అని తినేస్తున్నారు. మరికొందరు తప్పనిసరై తింటున్నారు . అయితే ఇలాంటి కల్తీ పదార్థాలు తినడం వల్ల జీర్ణకోశ సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు ,మధుమేహం , అధిక రక్తపోటు, ,ఊపిరితిత్తులు, కిడ్నీలు ఫేలవడం, క్యాన్సర్ లాంటి ప్రమాదకర రోగాలను కొని తెచ్చుకోవడం అవుతుంది. ఇక్కడ ప్రజలు, పాలకులు రెండు అంశాలు గుర్తించాల్సిన అవసరం ఉంది.ప్రజలు సాధ్యమైనంతవరకు బయట తినడం మానేసి నాణ్యమైనవి ఇంట్లో చేసుకొని తినడం మంచిది. అది అన్నివేళల అందరికీ సాధ్యం కానందున ప్రభుత్వం ప్రజారోగ్య భద్రత కోసం బాధ్యతగా కల్తీనే నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి కల్తీ ముఠాలపై కఠిన చర్యల్ని ,నిరోధించడానికి కఠిన చట్టాల్ని అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.అప్పుడే ప్రజారోగ్యానికి భద్రత ఏర్పడుతుంది.

– నర్రా భగవాన్ రెడ్డి..
రచయిత
9492913165