Take a fresh look at your lifestyle.

కొత్త పాలకవర్గంపై కోటి ఆశలు…! అసంపూర్తి పనులు పూర్తయ్యేనా? పట్టణ సుందరీకరణ జరిగేనా

ముద్ర ప్రతినిధి, మెదక్:
ఘన చరిత గల మెదక్ పట్టణం… ఒకప్పుడు రాచవీడుగా పేరొందింది. ప్రభుత్వాలు మారినా…. పాలకులు మారుతున్నా పట్టణ ముఖం చిత్రం మాత్రం మారడం లేదు. తాజాగా బల్దియా కొత్త పాలకవర్గం వచ్చింది. జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలో అనేక సమస్యలు నెలకొన్నాయి. అసంపూర్తి పనులు వెక్కిరిస్తున్నాయి. వాటిని పూర్తి చేసి పట్టణ పౌరులకు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది. కొత్త పాలకవర్గంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. పాలకవర్గం ఎంత వరకు దృష్టి సారిస్తుందో వేచి చూడాలి.

మెదక్ రాందాస్ చౌరస్త్ అసంపూర్తిగా
మెదక్ రాందాస్ చౌరస్త్ అసంపూర్తిగా
 ప్రారంభించి వదిలేసిన బోటు
 మెదక్ గోసంద్రం చెరువు మినీ ట్యాంక్ బండ్ అసంపూర్తి    
ప్రారంభానికి నోచుకోని రైతు బజార్

పాలకావర్గం దృష్టి పెట్టాల్సింది…
జిల్లా కేంద్రం అయినప్పటికీ పట్టణంలో మూడు ప్రధాన కూడళ్లు బోసిపోతున్నాయి. వీటి అభివృద్ధికి నిధులు కేటాయించినా పనులు ఇంకా ప్రారంభం కాలేదు. చౌరస్తాలు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి.వాటిని సుందరీకరించాల్సిన అవసరం ఉంది.
ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో కేవలం మెదక్ పట్టణంలో చిల్డ్రన్స్ పార్క్ ఉండేది. నేడు అది మిషన్ భగీరథ పైలాన్, కార్యాలయాల సముదాయంగా మారింది. సుమారు 70 వేల జనాభా ఉన్న పట్టణంలో ఒక్క పార్క్ లేకపోవడం శోచనీయం.
రూ.9 కోట్లతో పిట్లం, గోసంద్రం చెరువులను మినీట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దే పనులు అసంపూర్తిగానే మిగిలి ఉన్నాయి. వాటిని పూర్తి చేసి పట్టణ ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది.చారిత్రాత్మక మెదక్ చర్చి, దేశంలో 8వదిగా పేర్కొనే ఖిల్లా వద్ద మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించి పర్యాటకులను ఆకర్షించాల్సిన అవసరం ఉంది.
రాందాస్ చౌరస్తా నుండి చమన్, దాయర రోడ్డు విస్తరణ అవురుందా కాదా అన్న సందేహంలో నెలకొంది. కొన్ని ఇళ్ళు కూల్చినప్పటికి విస్తరణ పనులు జరగడం లేదు. విస్తరించడం వల్ల పట్టణ ప్రజలకే కాకుండా అనేక గ్రామాల వారికి ఎంతో ఉలయోగకరంగా ఉంటుంది.
పట్టణంలోని మిషన్ భగీరథ పైపుల పనుల కోసం అంతర్గత సీసీ రోడ్లను ధ్వంసం చేశారు. వాటి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది.
కూరగాయల మార్కెట్లో దుకాణాలు లేక రోడ్డుపై విక్రయిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతుబజార్ నిర్మించినా ఇంకా అది అందుబాటులోకి రాలేదు. సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు పిల్లర్ల వరకు నిలిచిపోయాయి.
పట్టణంలో ఉన్న వైకుంఠధామాలలో కనీస మౌలిక వసతులు లేవు. ఇందిరా కాలనీ సమీపంలో నిర్మించిన వైకుంఠ దామం అసంపూర్తిగానే ఉంది. కనీసం అక్కడికి వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం కల్పించకపోవడం శోచనీయం.
మెదక్ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ లేదు. పార్కింగ్ జోన్ లు ఏర్పాటు చేయలేదు. ప్రధానంగా ఎంజీ రోడ్డు, జే ఎన్ రోడ్డులో పరిస్థితి మరీ దారుణంగా నెలకొంది. ఎప్పుడు, ఎక్కడ, ఏ వాహనం వస్తుందో తెలియదు. పట్టణానికి ప్రధానంగా బైపాస్ చాలా ముఖ్యం.
2020లో మెదక్ మున్సిపాలిటీలో విలీనమైన అవుసులపల్లి, ఔరంగబాద్, పిల్లికొట్టాల్లో మరిన్ని వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. వీటన్నింటిపై కొత్త పాలకవర్గం దృష్టి సారించాలి. స్థానిక ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు, లోక్ సభ సభ్యులు రఘునందన్ రావులు సహకారం అందించాలి.

అసంపూర్తిగా వదిలేసిన స్మశాన వాటిక
పిల్లర్లకే పరిమితమైన ఇంటిగ్రేటెడే మార్కెట్

Leave A Reply

Your email address will not be published.