- ప్రతి నియోజక వర్గంలో 4 వేల రాజీవ్ యువ వికాస యూనిట్లు.
- నిరు పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోంది.
- రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రివ పొంగులేటి శ్రీనివాస రెడ్డి.
పాలేరు, ముద్ర విలేకరి : మే నెలాఖరు లోగా అర్హులైన వారికి రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం చేపడతామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అలాగే, నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాస పథకంక్రింద ప్రతి నియోజక వర్గంలో 4 వేల మందికి చేయూత నిస్తూ సబ్సిడీ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు గాను ప్రభుత్వం రూ. 9 వేల కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. సోమవారం ఆయన పాలేరు నియోజక వర్గంలోని తిరుమలాయపాలెం ఎంపీడీఓ కార్యాలయంలో 64 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు లక్ష 116 రూపాయల చొప్పున, 57 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు18 లక్షల 65 రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా వుంటూ ప్రజా ప్రభుత్వం చిత్త శుద్ధితో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేక పోయినా పేదల కష్టాల్లో పాలు పంచుకోవాలని కళ్యాణలక్ష్మితో పాటు, ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేసిందన్నారు. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ క్రింద గడచిన సంవత్సర కాలంలో 1056 కోట్లు విడుదల చేశామన్నారు. అర్హులైన వారందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు.
- ధాన్యం తరుగు తీస్తే ఉపేక్షించేది లేదు.
అనంతరం స్థానిక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన మంత్రి పొంగులేటి, కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని సంబంధిత అధికార్లను ఆదేశించారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దని, తరుగు పేరిట కటింగ్ చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆ తర్వాత, గోపాయి గూడెంలో రూ.13.50 లక్షలతో నిర్మించనున్న మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గది నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. మేడిదపల్లి గ్రామంలోని ఎస్.సి. కాలనీలో రూ. 16 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు, తిమ్మక్కపేటలో రూ. 35 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు, ఎర్రగడ్డ ఎస్.సి. కాలనీలో రూ. 30 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కూసుమంచి క్యాంపు కార్యాలయంలో మండలానికి చెందిన14 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని18 మసీదుల అభివృద్ధి కోసం ఒక్కో మసీదుకు రూ. లక్ష చొప్పున చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, ఖమ్మం ఆర్డీవో జి. నర్సింహా రావు, పాలేరు నియోజక వర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఏడిఏ సరిత, తిరుమలాయపాలెం ఎంపిడివో ఎస్కె. సిలార్ సాహెబ్, ఇంచార్జ్ తహసీల్దార్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
