Take a fresh look at your lifestyle.

సమ్మె వాయిదా!

  • కార్మిక సంఘాలతో చర్చించిన మంత్రి పొన్నం.
  • చర్చల అనంతరం సమ్మె వాయిదా వేస్తున్నట్లు ప్రకటన.
  • మరోవైపు ఉద్యోగుల సమస్యలపై ఐఏఎస్​లతో త్రీమెన్​ కమిటీ.
  • పలు అంశాలపై దృష్టి పెట్టిన సర్కారు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది. ఈ నెల 6 అర్థరాత్రి నుంచి సమ్మె చేస్తున్నట్లు ఇటీవల ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్టీసీ జేఏసీ నేతలు మంగళవారం చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా వేసినట్లు జేఏసీ నాయకులు ప్రకటించారు. మంత్రితో చర్చల అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. ప్రైవేటు విద్యుత్‌ బస్సుల గురించి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. ప్రభుత్వమే విద్యుత్‌ బస్సులు కొని ఆర్టీసీకి ఇచ్చే చర్యలు చేపడతామని పేర్కొన్నారు. సింగరేణి మాదిరిగా రెగ్యులర్‌ ప్రాతిపదికన కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరామని చెప్పారు.కారుణ్య నియామకాలపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. విశ్రాంత ఉద్యోగుల బకాయిలపై సానుకూలంగా స్పందించారని, వేతన సవరణ గురించి సానుకూలంగా స్పందించారని అన్నారు.ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై కూడా సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు.
చాలా కాలంగా పెండింగ్​లో ఉన్న తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేయాలని ఇటీవల టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి వరకు చర్చలకు ఆహ్వానం రాకపోతే.. అదే రోజున అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ప్రకటించారు.ఈ క్రమంలోనే సోమవారం భారీ కవాతు సైతం నిర్వహించారు.దీంతో తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్‌తో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా పడింది.ఈ సమ్మె ప్రకటనపై ఆర్టీసీ యాజమాన్యం కూడా రిప్లై ఇచ్చింది.సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించింది. సమ్మె మొదలైతే ఎస్మా తప్పదని, ఎస్మా చట్ట ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేధమని యాజమాన్యం ప్రకటించింది.సంస్థ నిబంధనల మేరకు సమ్మె చట్టవ్యతిరేకమైనదని, సమ్మె పేరుతో ఉద్యోగులను ఎవరైనా బెదిరించినా, విధులకు ఆటంకం కలిగించినా బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని యాజమాన్యం హెచ్చరించింది.ఆర్థిక కష్టాల్లోనూ ఉద్యోగుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యమిస్తున్నామని, ఇప్పుడిప్పుడే కోలుకుంటూ అభివృద్ధి పథంలో పయనిస్తున్న సంస్థకు సమ్మె తీరని నష్టం కలిగిస్తుందని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది.అయితే, సమ్మె చేస్తామంటూ చెప్పిన జేఏసీ నేతలు.. ఈ సందర్భంగానే మంత్రి పొన్నం ప్రభాకర్​తో చర్చలు జరిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పైన అధ్యయనం.. ఉద్యోగ సంఘాలతో చర్చలకు తెలంగాణ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి.. వెంటనే కమిటీని నియమించారు.ఈ కమిటీలో ఐఏఎస్​లు నవీన్‌ మిట్టల్‌, లోకేష్‌ కుమార్‌, కృష్ణభాస్కర్‌ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది.దీంతో, ఆర్టీసీ జేఏసీ సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కమిటీ చర్చల తరువాత మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటామని జేఏసీ నేతలు వెల్లడించారు.ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ..ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంపై తమ ఆందోళనను వ్యక్తం చేయగా.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని వారు పేర్కొన్నారు. ప్రభుత్వమే స్వయంగా ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని వారు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని తాము నిర్ణయించుకున్నామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.అందువల్ల, తాత్కాలికంగా మాత్రమే సమ్మెను వాయిదా వేస్తున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు. అయితే, తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే.. తప్పకుండా మళ్లీ సమ్మె తేదీని ప్రకటిస్తామని హెచ్చరించారు. ఇది కేవలం తాత్కాలిక వాయిదా మాత్రమేనని జేఏసీ నేతలు పునరుద్ఘాటించారు.

  • సమస్యలు తీర్చుతాం : మంత్రి పొన్నం

ప్రభుత్వం నిర్ణయంతో సమస్యలపై జేఏసీ చర్చించి పరిష్కరించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఈ సందర్భంగా అన్నారు. సమ్మెతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని చెప్పారు. పలు సంఘాల నాయకులతో సమావేశం అనంతరం మంత్రి మట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు విని, పరిష్కరించేందుకు తనతోపాటు, ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు తెరిచే ఉంటాయన్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమ, ప్రయాణికుల సౌకర్యం ఈ మూడింటికి ప్రాధాన్యమిస్తున్నామని, 16 నెలల్లో ఆర్టీసీకి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశామన్నారు.ఉద్యోగులకు 2013 నుంచి చెల్లించాల్సిన బాండ్‌ మొత్తం రూ. 400 కోట్లు చెల్లించామని, పీఎఫ్‌ ఆర్టీనైజేసన్‌ సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రూ. 1039 కోట్లు చెల్లించామన్నారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టడంతో పాటు కొత్తగా 3038 ఉద్యోగాల భర్తీ చేశామని చెప్పారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం కోసం తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేశారని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని చెప్పారు.ఈ అంశాలపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ప్రజా పాలన ప్రభుత్వం లో ఆర్టీసీ కార్మికులు కుటుంబంలా భావిస్తున్నామని, ప్రజా ప్రభుత్వంఆర్టీసీకి వ్యతిరేకంగా ఏ ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఆర్టీసీ ని నిర్వీర్యం చేస్తే మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ఆర్టీసీని ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నిలబెడుతున్నామరు. ఇప్పటికే కొత్త బస్సులు కొనుగోలు చేశామని, తార్నాక ఆసుపత్రి ను సూపర్ స్పెషాలిటీ గా మార్చామని మంత్రి పొన్నం చెప్పారు.

  • ఐఏఎస్​లతో త్రీమెన్​ కమిటీ

తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆర్థిక పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థికపరమైన డిమాండ్లు నెరవేర్చే అవకాశం లేదని క్లారిటీ రావడంతో ఉద్యోగ సంఘాలు, ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా పునరాలోచనలో పడినట్లు అర్థమవుతుంది.ఆర్టీసీ సమ్మె ప్రకటన తర్వాత ఇతర ఉద్యోగులు కూడా పోరు బాట పట్టాలని డిసైడయ్యారు.దీంతో వారితో చర్చల కోసం ముగ్గురు అధికారులతో కమిటీని నియమించారు.నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణభాస్కర్ లు ఈ కమిటీలో ఉంటారు.వీరు ఉద్యోగ సంఘం నేతలతో చర్చలు జరుపుతారు.వారి డిమాండ్లు ఏమిటో తెలుసుకుని ప్రభుత్వం ముందు ఉంచుతారు.ఇటీవల ఈ పరిస్థితులపై సీఎం మాట్లాడారు.డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మెకు వెళ్తామంటున్న ఉద్యోగా సంఘాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు.ఉద్యోగ సంఘాల నేతలు ఇక సమరమే అంటున్నారని.. ఇదేదో మనోళ్లేనా, ఇంకెవరైనా అన్నారా అని అనుకున్నానని అన్నారు.ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై సమరం చేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారని ప్రభుత్వంలో పని చేసే ఉద్యోగులు మూడున్నర లక్షల మంది.. మీరు ప్రకటించిన సమరం 97 శాతం ప్రజల మీదనా అని ప్రశ్నించారు.అయితే, ఉద్యోగుల అంశంపై మాట్లాడేందుకు, చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ చెప్పిన సీఎం.. తాజాగా ఉద్యోగుల సంక్షేమం, పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి అధికారుల కమిటీని నియమించారు.

Leave A Reply

Your email address will not be published.