- నోట్ల కట్టలతో దొరికిన వారిని దొంగలాగే చూస్తారు.
- త్యాగాల ఫలితంగా దక్కించుకున్న రాష్ట్రాన్ని అవమానపర్చేలా మాట్లాడుతున్నారు.
- సీఎంగా రేవంత్ అసమర్ధుడు, చేతగాని వాడు అని అర్ధమైంది.
- తెలంగాణ చేతికి చిప్ప వచ్చే పరిస్థితి వచ్చింది.
- పీఆర్సీ, డీఏలు అడిగితే ప్రభుత్వ ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరిస్తారా..?
- పదేండ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పు 4 లక్షల కోట్లే.
- అనుములు కుటుంబం ఆస్తులు ఎలా పెరుగుతున్నాయి.
- ఫ్యూచర్ సిటీలో రేవంత్ కుటుంబానికి 2 వేల ఎకరాలు.
- కేసీఆర్‌ను దూషిస్తే నాలుక చీరేస్తాం.
- మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను దొంగే అంటారని, దొంగను దొంగలాగే చూస్తారని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.ఎంతో మంది త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచేలా మాట్లాడిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యల చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎందుకు ఈ ఫ్రస్టేషన్ అని ఆయన ప్రశ్నించారు.అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ వారు అనుకోలేదని, అడ్డగోలు హామీలు ఇచ్చారని ఆయన విమర్శించారు.ఇవాళ ఏం చేయాలో తెలుస్తలేదని, మొత్తం నాశనం చేశారన్నారు.దొంగ ప్రజల నుంచి తప్పించుకోవడానికి మార్గాలను వెతుకుతున్న పద్ధతుల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్లు కనిపిస్తోందని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక తెలంగాణలో ఏది స్థిరంగా లేదని, ఆయన కూర్చీ కూడా స్థిరంగా లేదని కేటీఆర్ విమర్శించారు. 17 నెలల కాలంలో 43 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారని, సీఎంతో పాటు ఆయన మంత్రులు హెలికాప్టర్లను షేర్ అటో వాడినట్లు వాడుతున్నారని ఆయన విమర్శించారు.ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు.వ్యక్తిగతంగా ఎన్ని దూషణాలు, తిట్లైనా తింటామని, అవమానాలు సహిస్తాం కానీ గత ఏడాదిన్నర కాలంగా మమ్మల్ని నోటికొచ్చిన బూతులు మాట్లాడినా చివరికి మా నాయకుడి చావును కోరుకుంటూ నికృష్టపు రోత మాటలు మాట్లాడినా తాం భరించామన్నారు. తమను ఎన్ని తిట్టినా పడుతాం కానీ, వేల మంది త్యాగాలతో, దశాబ్దాల పోరాటల ఫలితంగా టీఎన్జీవోలు, బుద్దిజీవుల నేతృత్వంలో రాజకీయ నాయకులు మేల్కొక ముందే.. విద్యార్థి సంఘాలు, కేసీఆర్ పోరాటం చేసి చివరకు తెలంగాణ సాధించారని ఆయన చెప్పారు.కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషిస్తే నాలుక చీరేస్తామని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.ఈ రాష్ట్ర భవిష్యత్‌కు ఒక శాపం పెట్టే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన దారుణంగా మాట్లాడారని అన్నారు.రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తుంటే..అత్యంత అసమర్థుడు, చేతగానివాడు, పనికిరాని దక్షత లేని పాలకుడు ఈదేశంలో ఇంకొకరు లేరని తేలిపోయిందన్నారు.420 హామీలతో అభయహస్తం పేరుతో ఇచ్చిన మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం అని తేలిపోయిందన్నారు. ఢిల్లీ పార్టీలను నమ్మితే 60 ఏండ్ల గోసపడ్డామని, మళ్లీ ఆ పార్టీలను నమ్మితే మోసపోతాం అని చెప్పారు.ఆనాడు ఎన్నికల సమయంలో ఢిల్లీ పార్టీలన నమ్మితే ఆగమైతది అని కేసీఆర్ చెప్పిన ప్రతి మాట అక్షర సత్యమని ఇవాళ రుజువైంది అని కేటీఆర్ పేర్కొన్నారు. నన్నెవరూ నమ్ముతలేరు, అప్పు పుడతలేదు, అపాయింట్‌మెంట్ దొరకట్లేదు. దొంగను చూసినట్టు చూస్తున్నారని రేవంత్ రెడ్డి మాట్లాడిన దివాళ కోరుమాటలు ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదని అన్నారు. తనకు పరిపాలన చేత కాదు అని రేవంత్ రెడ్డి చేతులెత్తేశారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.నోట్లకట్లలతో దొరికిపోయిన దొంగ చేతికి కాంగ్రెస్ పార్టీ తాళాలు ఇచ్చిందని ఆయన విమర్శించారు.రాహుల్ గాంధీ వరంగల్‌కు వచ్చి రైతు డిక్లరేషన్ పేరిట 2 లక్షల రుణమాఫీ, రైతుబంధు కింద రూ. 15 వేలకు పెంపు, కౌలురైతులకు రైతుబంధు, రైతుకూలీలకు న్యాయం చేస్తామని వ్యవసాయ డిక్లరేషన్‌లో చెప్పి మూడేండ్లు దాటిందన్నారు.కానీ ఏ ఒక్కటి పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు.తప్పు చేసింది రాహుల్ గాంధీ అని, దొంగచేతికి తాళాలు ఇచ్చి ఇవాళ తెలంగాణ చేతికి చిప్ప వచ్చే పరిస్థితి చేసింది రాహుల్ గాంధీనే అని కేటీఆర్ దుయ్యబట్టారు. ఇందుకు ఆయనే బాధ్యుడు అని కేటీఆర్ పేర్కొన్నారు.
- మీరు చెప్పిన దాన్నే ఉద్యోగులు అడుగుతున్నరు
కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పిన దాన్నే ఉద్యోగులు అడుగుతున్నరని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారన్నారు. కానీ ఏ ఒక్క హామీ ఇప్పటి వరకు నెరవేరలేదన్నారు. తెలంగాణ కోసం వారు చేసిన త్యాగం గురించి రేవంత్ రెడ్డికి ఇసుమంతైనా తెలియదన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి రెండు పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు కల్పిస్తామన్నారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికి పెండింగ్‌లో ఉన్న 3 డీఏలు తక్షణమే ఇస్తామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ తెస్తామని 317 రద్దు చేస్తామని, కొత్త పీఆర్సీ అమలు చేస్తామని చెప్పారన్నారు. ఇవాళ ఉద్యోగుల మీరు చెప్పిందే అడుగుతున్నరని, గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు. పీఆర్పీ, డీఏలు ఏవి అని అడగుతున్నారని,. కానీ మీరు ప్రజల ముందు ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహి అని ఆయన విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూశామన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులకు కీలక పదవులు ఇచ్చామన్నారు మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారన్నారు. అందాల పోటీలకు 250 కోట్లు ఉన్నాయి కానీ పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్లకు బెనిఫిట్స్‌కు పైసల్లేవా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
- ఏ ప్రభుత్వానికైనా అప్పులు వారసత్వంగా వస్తాయి
ఏ రాష్ట్రానికైనా ప్రభుత్వానికైనా అప్పులు, ఆస్తులు వారసత్వంగా వస్తాయని కేటీఆర్ అన్నారు. కాంగ్రెసోళ్లు తమకు అప్పజెప్పినప్పుడు అప్పులు, ఆస్తులు ఇచ్చారని కేటీఆర్ అన్నారు. 2014 లెక్కలు తీసుకుంటే.. రాష్ట్ర ఆదాయం 51 వేల కోట్లు. మేం దిగిపోయిన నాడు ఆదాయం 2 లక్షల 16 వేల 567 కోట్లు. మరి రాష్ట్ర ఆదాయం పెరగలేదా..? అని ఆయన ప్రశ్నించారు. 2014-15లో రెవెన్యూ మిగులు 369 కోట్లు.. మేం దిగిపోయిన నాడు 4882 కోట్లు. ఇది కాగ్ లెక్క. కానీ ఇష్టమొచ్చిన లెక్కలను రేవంత్ రెడ్డి చెబుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.