ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్
ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా జెడ్పీ మైదానంలో అవగాహన కార్యక్రమం
ఆరోగ్యాన్ని మించిన ఆస్తి మరొకటి లేదు
రోజువారీ ఆహారంలో ఉప్పు తగ్గించాలి : డాక్టర్ రమేష్ చంద్ర
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ రమేష్ చంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వాకర్స్‌కు హైపర్‌టెన్షన్‌పై పలు ముఖ్య సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజూ కనీసం 40 నిమిషాల పాటు నడక అలవాటు చేసుకోవాలని సూచించారు. నిత్య ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించి, మితంగా ఆహారం తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు.
హైపర్‌టెన్షన్‌కు గురికావడం లేదా దాని నుంచి దూరంగా ఉండడం చాలా వరకు మన జీవనశైలిపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. అనవసర విషయాలపై ఆందోళన చెందకుండా ప్రశాంతమైన జీవనం గడపాలని, మానసిక ప్రశాంతతతో ఉంటే అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని తెలిపారు.
ఆరోగ్యకరమైన అలవాట్లు, నియమిత వ్యాయామం, సమతుల్య ఆహారం ద్వారా రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో క్లాస్‌మేట్స్ క్లబ్ ఫౌండర్ రాఘవేందర్, సీనియర్ జర్నలిస్టులు కందికొండ మోహన్, మల్లేష్, నేతాజీ, వాకింగ్ వండర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.