ముద్ర, కరీంనగర్ :
రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అంతర్గత పరిస్థితి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు పార్టీలో విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయనే సంకేతాలు ఇస్తున్నాయి.
మంత్రి అడ్లూరి మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే ముసలం మొదలైందని, వర్గపోరు బహిర్గతమవుతోందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా హరీష్ రావు ఢిల్లీ పర్యటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఆయన ఎవరెవరు రాజకీయ నేతలను కలుస్తున్నారో ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఇక త్వరలో జరగనున్న జగిత్యాల సభలో పార్టీ అధినేత కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్), వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు (కేటీఆర్) పార్టీ భవిష్యత్‌పై స్పష్టత ఇవ్వాలని అడ్లూరి కోరారు. పార్టీలో కుటుంబ స్థాయిలో కూడా విభేదాలు పెరిగాయని, ఇప్పటికే కల్వకుంట్ల కవిత దూరమైందని పేర్కొన్నారు.
అదేవిధంగా, బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోయే బహిరంగ సభ నేపథ్యంలో పార్టీని విమర్శించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని, ఇది పార్టీ రెండుగా విడిపోయే ప్రమాదాన్ని సూచిస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంపై కూడా ఆయన విమర్శలు గుప్పిస్తూ, వారి వైఖరి “కూటీల మనస్తత్వం”గా ఉందని ఆరోపించారు.
మంత్రి అడ్లూరి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు దారి తీస్తుండగా, బీఆర్ఎస్ నాయకత్వం నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు.