- టీయూడబ్ల్యూజే (ఐజేయు)రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్.
- జిల్లా కేంద్రంలో భారీ సంఖ్యలో సభ్యత్వ నమోదు కార్యక్రమం.
ముద్ర ప్రతినిధి, వనపర్తి : అర్హులైన జర్నలిస్టుల అందరికీ కచ్చితంగా అక్రిడిటేషన్ కార్డులు అందించేలా కృషి చేస్తామని టియుడబ్ల్యూజే (ఐజేయు) జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధు గౌడ్ అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని యాదవ సంఘం భవనంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) జర్నలిస్టు యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం మన్యం, అరుణ్ రాజ్, కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మధు గౌడ్ మాట్లాడుతూ..జర్నలిజం వృత్తిలో ఉంటూ నిజమైన వార్త కథనాలను రాస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారిదిగా ఉంటున్న వారందరికీ యూనియన్ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు.అక్రిడిటేషన్ కార్డులను కొన్ని శక్తులు అంగట్లో సరుకుగా మార్చాయని,జర్నలిజం పరువు ప్రతిష్టలను దిగజార్చుతున్న అలాంటి శక్తులకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.గత ప్రభుత్వ హయాంలో వెలువడిన అక్రిడిటేషన్ జీవో అప్రాజస్వామికంగా ఉందని కొందరు కోర్టును ఆశ్రయించడం వల్ల అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఆలస్య మవుతుందన్నారు.మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో సీనియర్ పాత్రికేయులతో కూడిన కమిటీ సమావేశమై కొత్త నియమ నిబంధనలు రూపొందించి ప్రభుత్వం ముందు ఉంచడం జరిగిందన్నారు.ఈ నిబంధనలకు అనుగుణంగా ఫీల్డ్ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క జర్నలిస్టుకు తప్పకుండా అక్రిడిటేషన్ కార్డులు ఇప్పించేందుకు యూనియన్ ముందు వరుసలో ఉంటుందన్నారు.ఇటీవల కాలంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ లను కలిసి జర్నలిస్టులకు హెల్త్ కార్డులు (JHS )మంజూరు చేయాలని కోరగా మంత్రులు సానుకూలంగా స్పందించిన విషయాన్ని మధు గౌడ్ గుర్తు చేశారు.అంతేకాకుండా జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించిన ఘనత కూడా వనపర్తి జిల్లాకే దక్కిందన్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల కుటుంబాల కోసం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతం కావడమే కాకుండా ఇతర జిల్లాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఐజేయు యూనియన్ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని, అలాగే వ్యతిరేకం కూడా కాదన్నారు. నిజాలను నిర్భయంగా వార్త కథనాలు రాయడం తప్పు కాదు కానీ, వార్తలను అడ్డుపెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు.ఇప్పటికే జిల్లాలో మండలాల వారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకున్నామని,తాజాగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ కార్యక్రమానికి భారీ సంఖ్యలో జర్నలిస్టులు హాజరు కావడం యూనియన్ పై ఉన్న నమ్మకాన్ని మరింత చాటి చెప్పిందన్నారు.ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటుచేసిన నిర్వాహకులు లక్ష్మణ్, మన్యం, అరుణ్ రాజ్, కుమార్ లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డి మాధవరావు, సీనియర్ పాత్రికేయులు మల్యాల బాలస్వామి, పోలిశెట్టి బాలకృష్ణ, ఉషన్న, పౌర్ణారెడ్డి, శ్రీనివాసరావు, కొంతం ప్రశాంత్, రాజు, భాస్కర్, దినేష్, విజయ్, యాదిరెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు శివ, అంజి, నరసింహ రాజు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
