- జవహర్ నవోదయ విద్యాలయం వార్షికోత్సవంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.
ముద్ర, పాలేరు: విద్యతోనే మనకు అస్తిత్వం లభిస్తుందని, మన జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.శుక్రవారం పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు.చదువు లేకపోతే మన అస్తిత్వం కోల్పోతామని, ప్రతి చిన్న అంశంలో ఇతరులపై ఆధారపడి జీవించాల్సి ఉంటుందన్నారు.అందరికీ విద్య నందించేందుకు మన దేశంలో సుదీర్ఘ పోరాటాలు జరిగాయని, గతంలో రాజుల కొడుకులకు,ప్రముఖులకు మాత్రమే చదువుకునే అవకాశం ఉండేదన్నారు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత1950 నుండి భారత ప్రభుత్వం అందరికీ సమానంగా చదువుకొనే అవకాశం ఇవ్వాలన్న ఆలోచన చేసిందని చెప్పారు.మన జీవన ప్రమాణాలు పెంచుకునేందుకు విద్య తప్పనిసరని, బాగా చదువుకుంటే భవిష్యత్తులో మన అమ్మా, నాన్నలను బాగా చూసు కోవచ్చన్నారు.గతంలో తల్లిదండ్రులకు వివిధ కారణాల వల్ల చదువుకునే అవకాశం లభించ లేదని, ప్రస్తుతం మనకు నవోదయ వంటి అద్భుతమైన పాఠశాలల్లో చదువుకునే అవకాశం వచ్చిందని, దీనిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.ఈ సందర్భంగా వివిధ అంశాలలో గెలుపొందిన విద్యార్ధులకు కలెక్టర్ జ్ఞాపికలు, బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, వైస్ ప్రిన్సిపాల్ వెంకట రమణ, పేరెంట్ టీచర్స్ కమిటీ సభ్యులు రవీందర్ రెడ్డి, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
