అంగరంగ వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం.. వైభవంగా శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవం…
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
విశ్వేశ్వరుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి, సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో అర్చక స్వాములు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీ
కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రాతఃకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించారు.
సుప్రభాతసేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట దర్శనం, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి వేయి నామాల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. దివ్య క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనం గావించారు. అన్న ప్రసాద వితరణలో భాగంగా సుమారు 5000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం ఆదిమధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయ మానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామస్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు.
తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు.భక్తులు నయనానందకరంగా శ్రీవారినీ దర్శించుకున్నారు.