Take a fresh look at your lifestyle.

భయం భయమే..!తెలంగాణ రాజకీయాల్లో వీడని కలకలం!

క్లోజ్ అవ్వని ఢిల్లీ లిక్కర్ కేసు
హైకోర్టుకు వెళ్లిన సీబీఐ
తదుపరి అడుగులెటు..?
కొత్త పొత్తులకు తలుపులు తెరుచుకుంటాయా..?

ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఢిల్లీ మద్యం కేసులో 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చినా.. అసలు భయం మాత్రం వీడటం లేదు. నిజానికి, కింది కోర్టు తీర్పు ఇచ్చిన రోజునే.. సీబీఐ ఆఘమేఘాలపై హైకోర్టులో అప్పీల్ చేసింది. కేసు క్లోజ్ అవ్వకుండా.. ఇంకా ఉంది అనిపించింది. ఈ కేసులో ఇంత సీరియస్‌గా ఉన్న సీబీఐ.. కింది కోర్టును ఎందుకు సంతృప్తి పరచలేకపోయింది? ఈ కేసు తీర్పు తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది?.. అసలు ఈ కేసుతో కల్వకుంట్ల కుటుంబం కొంత రాజకీయ ఉపశమనానికి గురవుతుందా.. తదుపరి కవిత.. కేటీఆర్ అడుగులు ఎటువైపు అనేది ఇప్పుడు చర్చ.

ఢిల్లీ రౌస్ అవెన్యూ స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జి జస్టిస్ జితేంద్ర సింగ్ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కీలక తీర్పు ఇచ్చారు. మాజీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సహా మొత్తం 23 మంది నిందితులపై సీబీఐ నమోదు చేసిన అన్ని ఆరోపణలను కోర్టు కొట్టిశారు. “ప్రైమా ఫేసీ కేసు లేదు, ఆరోపణలు ఊహాగానాలు మాత్రమే, డబ్బు మార్గం లేదు, సాక్ష్యాలు లేవు” అని కోర్టు స్పష్టం చేసింది. సీబీఐ దర్యాప్తును “ప్రీమెడిటేటెడ్ అండ్ కొరియోగ్రాఫ్డ్” (ముందుగా ప్లాన్ చేసిన, నాటకీయం) అని తీవ్రంగా విమర్శించి, దర్యాప్తు అధికారిని.. దీనిపై ప్రశ్నించాలని కూడా ఆదేశించింది. అందువల్ల ఈ కేసు క్లోజ్ అయినట్లు కనిపించింది. కానీ.. నిజానికి క్లోజ్ అవ్వలేదు. కారణం సీబీఐ.. ఈ తీర్పు వచ్చిన కొన్ని గంటల్లోనే దీనిపై ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. తీర్పు వచ్చాక.. సీబీఐ ప్రతినిధి తన అధికారిక ప్రకటనలో “ట్రయల్ కోర్టు తీర్పులో దర్యాప్తు లోని అనేక అంశాల్ని లెక్కలోకి తీసుకోలేదు లేదా సరిగ్గా పరిగణించలేదు కాబట్టి వెంటనే హైకోర్టులో అప్పీల్ చేస్తాం” అని చెప్పారు. ఆ తర్వాత, కొన్ని గంటలకే హైకోర్టులో అప్పీల్ చేశారు. హైకోర్టు ఈ అప్పీల్‌ను హోలీ సెలవుల తర్వాత లిస్ట్ చేసే అవకాశం ఉంది. అందువల్ల ప్రస్తుతానికి కవిత ఈ కేసులో నిర్దోషిగానే ఉంటారు. కానీ.. హోలీ తర్వాత హైకోర్టు లిస్ట్ చేస్తే.. మళ్లీ ఆమె సహా 23 మందీ నిందితులు అవుతారు. ఇలా ఈ కేసు ఇంకా ముగియలేదనే సంకేతాలిస్తోంది.

ఏమిటీ తీర్పు..?
ఈ కేసు తీర్పు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఈ తీర్పు తర్వాత 2 నెలల్లో పార్టీ పెడతాననీ.. ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటుతామని కవిత ప్రకటించారు. అంతేకాదు.. బీఆర్ఎస్ పార్టీ, తన అన్న కేటీఆర్‌ని ఆమె తప్పుపట్టారు. కేటీఆర్ ట్వీట్‌పై మాట్లాడుతూ.. “నా వల్ల పార్టీ అధికారం కోల్పోయిందా? సరిగ్గా పరిపాలించి ఉంటే.. ఇలా అయ్యేది కాదు” అంటూ ఫైర్ అయ్యారు. కేటీఆర్ ట్వీట్ చేసి “బీఆర్ఎస్ ఈ సో-కాల్డ్ లిక్కర్ స్కామ్ వల్ల రాజకీయంగా బలి అయింది, 2023 అసెంబ్లీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో నష్టపోయింది” అన్నారు. ఇది కొంతవరకూ నిజమే. ఈ కేసు అప్పట్లో పార్టీకి బ్యాడ్‌నేమ్ తెచ్చింది. స్వయంగా సీఎం కూతురు అరెస్ట్ అవ్వడంతో చాలా మంది కవిత తప్పు చేశారా? అందుకే అరెస్టు అయ్యారా? అందుకే బీఆర్ఎస్ పార్టీ ఆమెకు బలంగా అండగా నిలబడలేకపోతోందా? అనే సందేహాలు వ్యక్తం చేశారు. ఆమె అరెస్టును బలంగా ఖండించే విషయంలో బీఆర్ఎస్.. పెట్టాల్సినంత ఎఫర్ట్ పెట్టలేదనే విమర్శలు ఎదుర్కొంది. అటు కేసీఆర్, ఇటు కేటీఆర్ కూడా.. కవితను కాస్త దూరం పెట్టినట్లే కనిపించారు. అందుకే జైలు నుంచి రిలీజ్ అయ్యాక కవిత కూడా ఆ దూరాన్ని మరింత పెంచుకున్నారు గానీ.. దగ్గర అవ్వలేకపోయారు. అలా ఆ కుటుంబంలో చీలిక మొదలైంది.

బీఆర్ఎస్‌లో అంతర్మథనం:
కవిత విషయంలో మనం సరిగ్గానే స్పందించామా లేదా అనే అంశంపై ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అంతర్మథనం జరుగుతున్నట్లు సమాచారం. అలాగే ఈ తీర్పు తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది అనేది కూడా పార్టీలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కవిత నిన్న ఓ మాట అన్నారు. “బీఆర్ఎస్ ఓటమికి కారణం నాయకత్వానికి ఉన్న అహంకారం, హామీలు నెరవేర్చకపోవడం” అని కేటీఆర్‌కి కౌంటర్ ఇస్తూ అన్నారు. ఇది కుటుంబ రాజకీయాల్లో లోతైన చీలికను చూపిస్తోంది. కేసీఆర్ మీద కక్ష సాధించడానికే తనను టార్గెట్ చేశారని కవిత చెప్పారు. ఎన్నికల ముందు వరకూ కేసీఆర్, కేటీఆర్ ఆమెకు మద్దతు ఇచ్చారు కానీ పార్టీ ఓటమి తర్వాత చీలిక ప్రభావం కనిపించింది. ఇక ఇప్పుడు ఆమె నెక్ట్స్ ఎన్నికల నాటికి ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ రెండు పార్టీలకూ పోటీగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. తనను జైలుకు పంపింది బీజేపీ అని భావిస్తున్న ఆమె.. కమలంతో కలిసే అవకాశాలు లేనట్లే అనుకుంటే అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చుతారా? లేక.. ఏదైనా ఒక పార్టీతో పొత్తుగా వెళ్తారా అనేది ఇప్పుడే చెప్పలేం. రాజకీయాలు డైనమిక్. ఏదైనా జరగొచ్చు. ఇప్పటికైతే.. కవిత హ్యాండ్ రైజ్ చేశారు. ఈ జోరు కొన్నాళ్లు కనిపించే అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో ఆమె బీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా చేసే వ్యాఖ్యలు.. ఆ పార్టీకి కొంత డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఐతే.. కవిత విషయంలో మొదటి నుంచి బీఆర్ఎస్ సైలెంటుగా ఉంటోంది కాబట్టి.. ఈ వ్యూహం బీఆర్ఎస్‌కి మేలే చేస్తుందనే అభిప్రాయం కూడా విశ్లేషకుల్లో ఉంది.

కొత్త రాజకీయ యుద్ధం
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఇప్పుడు రికవరీ చేసుకోవాలంటే కుటుంబ ఐక్యత అవసరమనీ, కానీ కవిత స్వతంత్రంగా ముందుకు సాగితే మాత్రం అది.. కాంగ్రెస్, బీజేపీకి కొంత ప్లస్ అవ్వగలదనే విశ్లేషణలు ఉన్నాయి. మొత్తం మీద ఈ తీర్పు కొత్త రాజకీయ యుద్ధానికి తెరతీసేలా ఉంది. సీబీఐ అప్పీల్ ఫలితం ఏమవుతుందో చూడాలి. తెలంగాణలో మహిళా నాయకత్వం, ఫెడరలిజం, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు ఇవన్నీ ఈ కేసు చుట్టూ తిరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలను విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ రాజకీయ పరిణామాలకు వేదికకానుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలతోపాటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు ఈ కేసులో పూర్తి విముక్తి లభించింది.

తీర్పుతో విమర్శలు డొల్లేనా!
దాదాపు మూడేళ్లుగా దేశ రాజకీయాలను కుదిపేసిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ట్రయల్ కోర్టు తాజా తీర్పుతో నీటి బుడగలా పేలిపోయినట్టే భావించాలి. సిబిఐ (CBI) దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో సరైన ఆధారాలు లేవని, నేరపూరిత కుట్రకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదని కోర్టు తేల్చి చెప్పింది. సౌత్ లాబీ నుంచి 100కోట్ల మొత్తాన్నీ కిక్ బ్యాగ్‌గా పొందారన్న ఆరోపణలనుంచి కేజ్రీవాల్‌తోపాటు కల్వకుంట్ల కవితపై ఉన్న ఆరోపణలన్నీ కొట్టివేస్తూ కోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. మనీ ట్రయల్ జరిగిందన్న ఆరోపణలకు సరైన ఆధారాలను సీబీఐ చూపలేకపోవడం ఈ కేసులో విచారణ సంస్థ ఆరోపణలను బలహీనపరిచాయి.

సార్వత్రిక ఎన్నికల వేళ అరెస్టులతో రాజకీయ దుమారం..
కవితను 2024 మార్చిలో హైదరాబాద్‌లోని ఆమె నివాసం నుంచి ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ తిహార్ జైలులో దాదాపు 5 నెలల పాటు గడిపారు. తన అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర జరిగిందనీ, బీజేపీ కావాలనే తనను ఇబ్బంది పెడుతోందని కవిత ఆరోపించారు. తెలంగాణలో ప్రభుత్వం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి కవిత అరెస్ట్ పెద్ద దెబ్బగా మారింది. కానీ తనపై ఆరోపణలను పార్టీ సరైన రీతితో స్పందించలేదని కవిత ఆక్షేపణ వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే కవితకీ బీఆరెస్ అధినేత కేసీఆర్‌కీ మద్య దూరం పెరిగిందని తరువాత పరిణామాలు చెబుతున్నాయి. ఇప్పుడవి కవిత బీఆరెస్‌నే టార్గెట్ చేస్తూ కొత్త పార్టీ పెట్టుకునేలా ప్రేరేపిస్తున్నాయి.

రెండున్నరేళ్ల వేధింపులు తొలగాయి అంటున్న కవిత..
తాజా తీర్పుతో సత్యమే గెలుస్తుందన్న నమ్మకం పెరిగిందన్నారు కవిత. “ఎప్పటికైనా కడిగిన ముత్యంలా బయటకు వస్తానని తెలుసు. ఈ రెండున్నరేళ్లు చాలా మంది అవమానకరంగా విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసి వేధించారు. ఈ తీర్పు వారందరికీ సమాధానం”అని కవిత చెప్పారు. అండగా నిలిచిన తల్లిదండ్రులకూ, కుటుంబానికీ, జాగృతి కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తీర్పు అనంతరం తల్లితో మాత్రమే ఫోన్లో మాట్లాడానని తెలిపిన కవిత తదుపరి కార్యాచరణపై ఎలాంటి అడుగులు వేయనున్నారో ఆసక్తికరంగా మారింది.

ఇకపై మారనున్న రాజకీయం, కొత్త పొత్తులకు తలుపులు తెరుచుకుంటాయా!
కవితపై ఆరోపణలను కోర్టు కొట్టివేయడంతో ఆమెకు భారీ ఊరట లభించినట్లైంది. బీఆరెస్‌తో విభేదించిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తలే కవితపై లిక్కర్ కుంభకోణం ఆరోపణల వల్లే పార్టీ నష్టపోయిందని విమర్శించారు. తాజా పరిణామాల వేళ కవితకు రాజకీయంగా అవకాశాలు పెరుగుతాయనే చెప్పుకోవచ్చు. కవిత కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే అవకాశాలపై అంచనాలకు ఈ తీర్పు కొత్త ఊపిరులు ఊదినట్టైంది. ఒకవేళ పొత్తుకు అవకాశముంటే ఈ తాజా తీర్పు వల్ల ఆ అడ్డంకులన్నీ తొలగిపోయినట్టే. తద్వారా కేసీఆర్, బీఆరెస్ పై తమ విమర్శలను మరింత పదును పెట్టేందుకు కాంగ్రెస్ ఇదో అవకాశంగా వినియోగించుకోవచ్చు. కవిత కొత్త పార్టీ పెట్టినా కూటమిగా బీజేపీ-బీఆరెస్ పై కవిత తన దాడిని పెంచొచ్చు. మరోవైపు బీజేపీ-బీఆరెస్ మధ్య దూరం తగ్గే అవకాశాలూ లేకపోలేదు.

Leave A Reply

Your email address will not be published.