Take a fresh look at your lifestyle.

ట్యాపింగ్ ట్రాప్..? తుది నిర్ణయం ఎవరిది.. కేసీఆర్ చుట్టూ ఉచ్చు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మారుతున్న పరిణామాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో :

ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుతోంది. ఈ కేసులో కేసీఆర్ చుట్టూ బిగిస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం కేసీఆర్ ను విచారించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారించిన సిట్.. అంతకు ముందు ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణకు తీసుకున్నది. దీనిపై సిట్ చీఫ్ సజ్జనార్, దర్యాప్తు బృందం కీలక నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.  కేసు పురోగతిపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని తెలుస్తోంది.

 

కేటీఆర్ విచారణ

రాజకీయ రణరంగానికి కారణమైన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను సిట్ అధికారులు విచారించారు. బుధవారం హరీష్‌రావును విచారించిన సిట్‌ గురువారం కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించడంతో.. జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయానికి కేటీఆర్ హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌ను సిట్ బృందం వివిధ అంశాలపై ప్రశ్నలు వేసింది. ఇప్పటి వరకు పలువురిని విచారించిన సిట్.. వారిద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయన్ని క్వశ్చన్ చేసింది. ఈ కేసులో ఇది వరకే అధికారులు, ప్రజా ప్రతినిధులను సిట్ బృందం ప్రశ్నించింది. వారి నుంచి వాంగ్మూలాలను సేకరించింది. వాటి ఆధారంగానే కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఈ విచారణలో ఇద్దరు అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. సీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి ఆయన్ని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక, శుక్రవారం ఉదయం నందిహిల్స్ నుంచి హరీష్‌రావుతో కలిసి కేటీఆర్ తెలంగాణ భవన్‌కు వచ్చారు. అక్కడ ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. మహిళా నేతలు ఆయనకు తిలకం దిద్ది ఆశీర్వదించారు. అనంతరం ఆయన ముఖ్య నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. తననే టార్గెట్ చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దుష్ప్రచారం చేస్తోందని ఇప్పుడు జరుగుతున్నది అదేనంటూ విమర్శలు చేశారు. మీడియా సమావేశం తర్వాత హరీష్‌రావుతో కలిసి సిట్ కార్యాలయానికి కేటీఆర్ వచ్చారు. చాలా దూరంలో అందరి వాహనాలను పోలీసులు ఆపేశారు. కేవలం కేటీఆర్ హరీష్‌ రావు వాహనాలను పీఎస్‌ వరకు అనుమతి ఇచ్చారు. పీఎస్‌ వరకు హరీష్‌రావుతో వచ్చిన కేటీఆర్ ఒక్కడినే విచారణకు అనుమతి ఇచ్చారు. విచారణ జరుగుతున్న టైంలోనే జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. తమను అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ముందే తమను తమ నేతలను అడ్డుకోవడంపై మండిపడ్డాయి. అయినా పోలీసులు వారిని నియంత్రించి అక్కడి నుంచి పంపేశారు. ఇలాంటివి జరుగుతాయని ముందే గ్రహించిన పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. విద్యార్థు నాయకులను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని పలువురు లీడర్లను ఇంటి నుంచి రానీయలేదు.

 

ఒకే ప్రశ్న.. పలు రకాలుగా..

ప్రధానంగా కేసీఆర్ టార్గెట్ గా ఈ విచారణ సాగుతున్నట్లు అర్థమవుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తుది నిర్ణయం ఎవరిది..? ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయమని ఎవరు చెప్పారు.. అందులో మీ పాత్ర ఏమిటి..? అప్పటి సీఎం ఏమైనా ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారా..? దీనిపై తుది నిర్ణయం ఎవరు తీసుకున్నారు.. అనే ప్రశ్నలు కేటీఆర్ ముందు సిట్ టీం ఉంచినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే కేసీఆర్ చుట్టూూ ఉచ్చు బిగిస్తేనే.. ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేందుకు అనుమతి ఉంటుందని సిట్ భావిస్తున్నది.

 

అదే కారణం..?

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా ప్రస్తావించడానికి కారణం నాడు జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం. అప్పట్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు ప్రణాళిక రూపొందించారని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ విమర్శలు చేశారు. అంతేకాదు, ఒక ఆడియో కూడా విడుదల చేశారు. అయితే ట్యాపింగ్ వల్లనే ఈ ఆడియో బయటికి వచ్చిందని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఆడియోను ఎలా రికార్డ్ చేశారు? ఎక్కడి నుంచి వివరాలు సేకరించారు? అనే విషయాలను పోలీసులు రాబట్టారని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులైన ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావుతో పాటు పలువురు ఇచ్చిన స్టేట్మెంట్ల ప్రకారం కేసీఆర్ ను సిట్ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. నాడు కేసీఆర్ ఆరోపించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో దక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ ను కూడా పోలీసులు విచారించారు. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. నందకుమార్ ఫోన్ ను ట్యాప్ చేయడం ద్వారానే.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నాడు కేసీఆర్ గుర్తించారని సిట్ భావిస్తోంది.అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ నిర్వహించిన విలేకరుల సమావేశం.. మీడియాలో ప్రసారమైన ఆడియో, వీడియో రికార్డులను కూడా ఇప్పటికే సేకరించింది. వీటి ఆధారంగానే నాటి మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. బీజేపీ నేతలను అడ్డంగా ఇరికించడానికి కేసీఆర్ ఆడియో టేపులను బయటపెట్టారు. అవే ఇప్పుడు ఆయనకు చిక్కులు తెచ్చాయని పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది.

 

ఇక మిగిలింది కేసీఆరే

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ బృందం కీలక విచారణ మొత్తం పూర్తి చేసింది. అధికారులు, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను విచారించిన తర్వాత హరీష్ రావు, కేటీఆర్ ను విచారణకు పిలిచారు. ముందు నుంచీ అప్పటి ఇంటలీజెన్సీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు పలువు పోలీసులు చెప్పిన ఆన్సర్ కేవలం ఒక్కటే. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల ప్రకారమే తాము ట్యాపింగ్ చేశామని చెప్పుకొచ్చారు. దీనిలో భాగంగానే ఇప్పుడు సిట్ టీం.. కేటీఆర్ వరకూ వచ్చింది. కేటీఆర్ విచారణ తర్వాత కేసీఆర్ కు నోటీసులు ఇస్తారని టాక్.

Leave A Reply

Your email address will not be published.