- మొత్తం 18 వేలమంది పోలీసుల బందోబస్తు.
- హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : శ్రీరామనవమి సందర్భంగా ఈనెల 6న హైదరాబాద్ నగరంలో నిర్వహించే శోభాయాత్రను ప్రశాంతంగా, సంతోషంగా జరుపుకోవాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు.ఈ మేరకు గురువారం కోఆర్డినేషన్ మీటింగ్‌ను కమిషనర్ ఆనంద్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీతారాంబాగ్ నుంచి శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభమవుతుందని, నిర్వహకులు మధ్యాహ్నం ఒంటిగంట లోపే శోభాయాత్ర ప్రారంభమయ్యేలా చూడాలని సూచించారు. మొత్తం 18వేల మంది పోలీసులు బందోబస్తు విధుల్లో ఉంటారని, వారితో పాటు షీటీమ్స్ పర్యవేక్షణ కూడా ఉంటుందన్నారు.శోభాయాత్ర సాగే మార్గాలు చిన్నవిగా ఉండటం వలన భారీ వాహనాలు కాకుండా చిన్న వాహానాలను వినియోగించాలని కోరారు.అలాగే ఉత్సవమూర్తుల విగ్రహాల ఎత్తు కూడా తక్కువగా ఉండేలా చూడాలన్నారు.డ్రోన్లు ఎగురవేయాలంటే ముందు పోలీసులు అనుమతి తీసుకోవాలన్నారు.శోభాయాత్రలో పెద్దపెద్ద డీజే శబ్ధాలు లేకుండా నిర్వహకులు జాగ్రతలు పాటించాలన్నారు.మరీముఖ్యంగా శోభాయాత్రలోని పాటలు వేరే వర్గాల వారిని కించపరిచేలా ఉండకూదన్నారు.క్రౌడ్ ఎక్కువగా ఉంటే చైన్ స్నాచింగ్, చోరీలు జరిగే అవకాశం ఉన్నందున అలాంటి వాటిపై ఫోకస్ పెట్టామన్నారు. శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతం చేయాడానికి అన్ని ప్రభుత్వ విభాగాలు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆనంద్ కోరారు.