- అప్పటిదాకా స్పీకర్ ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలా ?
- సీఎం స్వీయ నియంత్రణ పాటించరా ?
- పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీం కోర్టు సీరియస్.
- సీఎం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కింద తీసుకోవాల్సి ఉంటుంది.
- ముగిసిన ఇరు పక్షాల వాదనలు= తీర్పు రిజర్వు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ కొనసాగింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శి తరఫున న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద తరఫున ఆర్యామ సుందరం వాదించారు.అనంతరం ఇరు పక్షాల వాదనలను ముగించిన దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది.
- మీ దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఏంటి?
సుప్రీంకోర్టులో గురువారం జరిగిన విచారణలో తొలుత అభిషేక్ మనుసింఘ్వీ తన వాదనలు వినిపించారు. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని న్యాయస్థానం దృష్టికి ఆయన తీసుకెళ్లారు. మణిపూర్ వ్యవహారం పూర్తిగా భిన్నమైనదని, ఆ ఒక్క విషయాన్ని ప్రత్యేకంగా పరిగణించారని అన్నారు. అలాగే రాణా కేసు పూర్తిగా ప్రత్యేకమైనదని, ప్రస్తుత ఆ అంశానికి సరిపోదని సింఘ్వి కోర్టుకు తెలిపారు. దీంతో రాణా కేసులో కోర్టు జోక్యం చేసుకుని అనర్హత విధించిందని జస్టిస్ గవాయ్ తెలిపారు. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందిస్తూ ‘మీ దృష్టిలో రీజనబుల్ టైమ్ అంటే ఏంటి?’ అని సింఘ్వీని ఆయన ప్రశ్నించారు.న్యాయవాదులు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం చాలా ఇబ్బందికరంగా ఉందని, సుప్రీంకు వచ్చిన తర్వాత వారి తీరు పూర్తిగా మారిపోతోందని వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై బుధవారం కూడా సుదీర్ఘవిచారణ జరిగింది. స్పీకర్ తరఫున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. గురువారం స్పీకర్ కార్యదర్శి తరఫున సింఘ్వి వాదనలు వినిపించారు.ఇటీవల అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలను కౌశిక్‌రెడ్డి తరఫు న్యాయవాది ఆర్యామ సుందరం మరోసారి ప్రస్తావించారు.ఉప ఎన్నికలు రావు స్పీకర్ తరఫున కూడా చెబుతున్నా’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలో మాట్లాడితే ఏ కోర్టు నుంచి అయినా రక్షణ ఉంటుందని అన్నారని తెలిపారు.దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ ముఖ్యమంత్రి కనీసం స్వీయ నియంత్రణ పాటించలేరా? గతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఆ తర్వాత కూడా ఇలాగే వ్యవహరిస్తే ఎలా? అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు.
- ప్రతిపక్షం రెచ్చగొడుతుంది.
వాదనల సందర్భంగా అభిషేక్ మనుసింఘ్వీ కలుగజేసుకుని ప్రతిపక్షం నుంచి అంతకు మించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.ఇప్పుడు అవన్నీ అప్రస్తుతమన్న ధర్మాసనం వాటిని పక్కన పెట్టింది. ముఖ్యమంత్రి మాటలు కోర్టు ధిక్కారం కింద తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ గవాయ్ అన్నారు.’‘మేం సంయమనం పాటిస్తున్నాం. మిగతా రెండు వ్యవస్థలు అదే గౌరవంతో ఉండాలి’’అని ఆయన వ్యాఖ్యానించారు. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత కోర్టులో కేసులతో తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని చూశారని సింఘ్వీ పేర్కొనగా సింగిల్ జడ్జి ఇచ్చిన సూచనలను సానుకూలంగా తీసుకుని ఉంటే కేసు ఇక్కడి వరకు వచ్చేది కాదని జస్టిస్ గవాయ్ అన్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి విచారణకు వచ్చిన తర్వాతే నోటీసులు ఇచ్చారని గవాయ్ అన్నారు. ఈ క్రమంలో మణిపూర్ వ్యవహారం, రాణా కేసుతో పాటు మరికొన్ని అంశాలను అభిషేక్ సింఘ్వి కోర్టుకు వివరిస్తూ వాదనలు ముగించారు.
- సుప్రీంకు అన్ని అధికారాలు ఉంటాయి.
అభిషేక్ మను సింఘ్వి వాదనలు ముగియడంతో..పిటీషనర్ల తరపున కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది ఆర్యామ సుందరం మరోసారి చివరి వాదనలు వినిపించారు.మహారాష్ట్ర వ్యవహారం సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిందన్నారు.స్పీకర్‌కు తగిన ఆదేశాలు ఇవ్వడానికి సుప్రీంకోర్టుకు అన్ని అధికారాలు ఉన్నాయన్నారు.సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ తప్పక తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రాజ్యాంగ ధర్మాసనం తీర్పులో పేర్కొందని న్యాయవాది ఆర్యామ సుందరం అన్నారు.
- వాదనలు పూర్తి తీర్పు రిజర్వు.
జనవరిలో సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించాక స్పీకర్ నోటీసులు ఇచ్చారని, మూడు వారాలు సమయం ఇచ్చారని, ఆ మూడు వారాల సమయం కూడా పూర్తి అయిందని న్యాయవాది ఆర్యామ సుందరం అన్నారు. నోటీసులు పంపిన సమాచారం కూడా ప్రతిపక్ష నేతకు ఇవ్వలేదని న్యాయవాది పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మరోసారి ప్రస్తావించారు.దీనిపై న్యాయవాది ముకుల్ రోహత్గీ అభ్యంతరం చెప్పారు.ధర్మాసనం కూడా తాము ఆ విషయంలోకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది.దీంతో బీఆర్ఎస్ పిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణ సుప్రీంకోర్టులో ముగిసింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. అయితే 8 వారాల్లోగా తీర్పు ఇవ్వాలని సుప్రీం కోర్టును న్యాయవాది ఆర్యమ సుందరం కోరారు.దీంతో సుప్రీంకోర్టు ఈ కేసులో ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అన్నది ఆసక్తికరంగా మారింది.