Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలే

  • నిన్న హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో అకాల వర్షాలు.
  • చార్మినార్‌లోని ఓ మీనార్ నుంచి ఊడిపడిన పెచ్చులు.
  • అకాల వర్షంతో తడిచి ముద్దయిన ధాన్యం.
  • నేలరాలిన మామిడిపంట.
  • పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు, 21 మేకలు మృత్యవాత.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో నేటి నుంచి 6వ తేదీ వరకు హైదరాబాద్ నగరంతో పాటు ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అకాల వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప రైతులు, ప్రజలు బయటకురావొద్దని వాతావరణ శాఖ సూచించింది. రెండు రోజుల పాటు 2-4 డిగ్రీలు తక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

  • హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో అకాల వర్షాలు.

గురువారం హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. ఎండల తీవ్రత నుంచి హైదరాబాద్ నగర వాసులకు ఉపశమనం లభించినప్పటికీ , ఆయా జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు రైతులకు తీవ్ర నష్టం జరిగింది. కల్లాలలో ఆరబోయిన ధాన్యాలు, పంట తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. హైదరాబాద్‌లో కురిసిన కుండపోత వర్షానికి రహదారులన్నీ జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రాష్ట్ర సచివాలయం ముందు రహదారి చెరువును తలపించింది. చార్మినార్‌లోని ఓ మీనార్ పై నుంచి పెచ్చులు ఊడి కిందపడ్డాయి. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదు. ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో మాన్యువల్‌గా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచడంతో అనేకచోట్ల చెట్లు నేల కూలాయి. ఖైరతాబాద్ మెర్క్యూరీ హోటల్ వద్ద చెట్టు కూలడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న ఇద్దరు మహిళలు సురక్షితంగా బయటపడ్డారు. చాదర్‌ఘాట్ రైల్వే ట్రాక్ కింద వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాయి.

  • పిడుగుపాటుకు ఇద్దరు మృతి

నాగర్ కర్నూల్ జిల్లా కూడన్‌పల్లి గ్రామానికి చెందిన సుంకరి సైదమ్మ (35), వీరమ్మ (55) అనే ఇద్దరు మహిళలు పిడుగుపాటుతో మృతిచెందారు. మరో మహిళ సుంకరి లక్ష్మమ్మకు తీవ్ర గాయాలపాలైంది. దీంతో బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా ఇస్రీతాబాద్‌లో పిడుగుపాటుకు 21 మేకలు చనిపోయాయి. దీంతో తాను జీవనోపాధిని కోల్పోయాయనని రైతు లచ్ఛయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కామారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షంతో పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్ల పక్కన ఆరబోసిన మొక్కజొన్న, ధాన్యం తడిసి ముద్దయింది. యాదాద్రి భవనగిరి జిల్లాలో భారీగా మామిడిపంట నేల రాలింది. నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి, ఇందల్వాయి, సిరికొండ, డిచ్‌పల్లి, మోపాల్ మండలాల్లో వరి ధాన్యం తడిచిపోయింది.

Leave A Reply

Your email address will not be published.