మార్చి 13లోపు డిమాండ్లు పరిష్కరించాలి
లేదంటే సమ్మె నోటీసు
మార్చి 18 తర్వాత సమ్మె
ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ ఆల్టీమేటం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మరోసారి సమ్మె సైరన్ మోగే అవకాశం కనిపిస్తోంది. కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మరోసారి పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలు, న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టాలని నిర్ణయానికి వచ్చారు. ఏండ్ల నుంచి అమలుకు నోచుకోని సమస్యలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో.. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, జీతాల పెంపు, పెండింగ్ బకాయిల విడుదల సహా పలు డిమాండ్లపై కార్మికులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. జేఏఆస్ ఆధ్వర్యంలో ఈ నెల 24న హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద వేలాది మంది కార్మికులు ధర్నా చేశారు. మార్చి 13 తేదీలోపు డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మె నోటీసు ఇవ్వటంతో పాటు మార్చి 18 తర్వాత స్ట్రైక్ చేస్తామని సర్కార్‌ను హెచ్చరించారు. కాగా కార్మికులు ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని గత కొన్నేళ్లుగా కోరుతున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కొత్త పే రివిజన్ కమిషన్ నివేదికను అమలు చేసి, పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో నిలిపివేసిన డీఏలు, పీఎఫ్, ఇతర పెండింగ్ బకాయిలను వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని.. సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు, డ్రైవర్లు, కండక్టర్లపై పెరుగుతున్న పని ఒత్తిడిని తగ్గించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సర్కార్ నుంచి సానుకూల స్పందన రాకపోవటంతో సమ్మెకు వెళ్లాలని భావిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే.. ఆర్టీసీ బస్సుల్లో నిత్యం ప్రయాణించే లక్షలాది మంది కార్మికులకు ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొన్నది. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, నిత్యం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వచ్చే సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈలోపే స్పందించి కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.