Take a fresh look at your lifestyle.

బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థిని ఆత్మహత్య

 

వ్యక్తిగత కారణాలని అనుమానిస్తున్న పోలీసులు

క్యాంపస్ లో ఉద్రిక్తత

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా బాసర త్రిబుల్ ఐటీ లో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న వనపర్తి జిల్లాకు చెందిన వసంత(19) అనే విద్యార్థిని బాలికల హాస్టల్లో మంగళవారం తెల్లవారు జామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకుని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐతే ఆమె వ్యక్తిగత కారణాలతో కానీ, కుటుంబ సమస్యలతో కానీ మృతి చెంది ఉంటుందని ఆమె మిత్రులు పేర్కొంటున్నారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐతే ఈ ఘటన వెనుక ఉన్న వాస్తవాలను వెలికి తీయాలని డిమాండ్ చేస్తూ వెంటనే విద్యార్థులు వైస్ ఛాన్సలర్ ఛాంబర్ ను ముట్టడించేందుకు దూసుకు వెళుతుండడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఐతే పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

మృతి వెనుక అంతు పట్టని మిస్టరీ


పోలీసులు సంఘటన స్థలంలో సేకరించిన అంశాల ప్రకారం పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతురాలు వసంత గణేష్ అనే యువకునితో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు చెబుతున్నారు. మంగళవారం రాత్రి గణేష్ నుండి వచ్చిన ఫోన్ కాల్ అనంతరం మృతురాలు ఆందోళన చెందినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మనోవేదనతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని భావిస్తున్నారు. అనంతరం ఫోన్, వాట్సాప్ బ్లాక్ చేసిందని సమాచారం. ఇదిలా ఉంటే మంగళవారం రాత్రే ఆమె ప్రియుడు గణేష్ కూడా హైదరాబాద్ లోని ఒక హాస్టల్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. గణేష్ ఆత్మహత్య విషయం తెలిశాక మృతురాలు వసంత చేతికి, మెడపై కత్తితో కోసుకున్నట్లు భావిస్తున్నారు. కాగా మెడపై, చేతిపై గాయాలు ఉండడం పట్ల విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చివరగా ఫోన్ చేసిన గణేష్ , వసంత మధ్య ఫోన్ కాల్ లో ఏం జరిగింది? కుటుంబ సభ్యులు వీరి ప్రేమను అంగీకరించక పోవటమే వీరిద్దరి ఆత్మహత్యలకు కారణమా అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం భైంసా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.