వెల్గటూర్, ముద్ర : జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలం లోని పైడిపల్లి గ్రామంలో కూన రఘు(22) అనే యువకుడు ఇంట్లో ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. ఎస్సై ఉమాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం వెల్గటూర్ మండలంలోని పైడిపెల్లి గ్రామానికి చెందిన కూన రఘు “డిగ్రీ” లో మూడు సబ్జెక్ట్ లలో ఫెయిల్ అయ్యాడు. కుటుంబ పోషణకోసం కరీంనగర్ లో ఓ పెట్రోల్ బంక్ లో పని చేస్తున్నాడు. కాగా డిగ్రీ లో తప్పిన పరీక్షలను పలుమార్లు రాసిన పాస్ కావడం లేదు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో తాను తప్పిన పరీక్షల గురించి చెబుతూ బాధపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో మనస్థపానికి గురైన రఘు ఇంట్లో ఎవ్వరు లేని సమయం లో చీరతో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య యత్నం చేశాడు. కాగా కుటుంబ సభ్యులు గమనించి కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ తరలించగా వైద్యులు అప్పటికే ఆయన చనిపోయినట్లు తెలిపారు. కాగా మృతుడి తండ్రి మల్లేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.
