సాంకేతిక ఆధారాలతో నిందితుడి గుర్తింపు.. అరెస్ట్
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
మద్యం తాపించి ప్రాణ స్నేహితుడిని దారుణంగా హత్య చేసి, ఆధారాలు దొరకకుండా శవాన్ని తగలబెట్టిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి క్లూ లేని ఈ కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఛేదించారు. మంగళవారం ఉదయం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
*పాత కక్షలే కారణం:*
పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్, ఆల్వాల్ పరిధిలోని జొన్నబండకు చెందిన పొన్నకంటి కాశి అలియాస్ ప్రభ (23) జీఎంహెచ్ ఎంసీ అల్వాల్ ఏరియాలో గార్బేజ్ కలెక్షన్ బాయ్ గా, రాపిడో రైడర్ గా పనిచేస్తుంటాడు. ఇతనికి అదే ప్రాంతానికి చెందిన పొన్నకంటి శేఖర్ (మృతుడు) మిత్రుడు. గతంలో వీరిద్దరూ కలిసి ఒక స్క్రాప్ షాపులో రాగి తీగ (కాపర్ వైర్ ) దొంగతనం చేశారు. ఆ సమయంలో యజమాని శేఖర్‌ను పట్టుకోగా, అతను కాశి పేరును బయటపెట్టాడు. ఈ విషయంలో జరిగిన పంచాయతీలో కాశి నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. తన పేరు చెప్పి అవమానపరిచాడన్న కక్షతో కాశి, శేఖర్‌ను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.
*హత్య చేసి.. పెట్రోల్‌తో తగలబెట్టి..*

ఎలాగైన శేఖర్ ను హత్య చేయాలని నిర్ణయించుకున్న కాశీ మృతుడిని బొల్లారం దగ్గర బైక్ ఎక్కించుకున్నాడు. మొదట బొల్లారం దగ్గర మద్యం సేవించారు. అనంతరం హకీంపేట తూంకుంట మధ్యలో పెట్రోల్ బంకులో 100 వంద రూపాయల పెట్రోల్ కొన్నారు. అప్పటికి కాశీని బాటిలో పెట్రోల్ ఎందుకు అని ప్రశ్నించాడు. దానికి బైక్ మైలేజ్ తక్కువ వస్తుందని, అందుకే బాటిల్ లో పెట్రోల్ తీసుకుంటున్నా అని చెప్పాడు. తరువాత షామీర్‌పేట్ నుంచి తిమ్మాయిపల్లి మీదుగా కీసరకు వచ్చారు. అక్కడి నుంచి సర్వీస్ రోడ్డు మీదుగా ఘట్కేసర్ వైపుకు వచ్చారు. అక్కడి నుంచి వరంగల్ హైవే నుంచి భువనగిరి వైపుకు వచ్చి, అక్కడి నుంచి హన్మాపుర్ మీదుగా వడపర్తి, మర్యాల వైపుకు వెళ్లారు. అక్కడ ఒక నిర్మానుశ్య ప్రదేశానికి వెళ్లి మళ్లీ మద్యం సేవించారు. అక్కడ శేఖర్ మద్యం ఎక్కువై కిందపడిపోగా వెంటనే కాశీ మృతుడి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం బాటిల్ లో తెచ్చుకున్న పెట్రోల్ తో పోసి తగలబెట్టాడు. తగలబెట్టిన అనంతరం మృతుడి ఫోన్ ను తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చెట్ల ల్లో విసిరేసి అక్కడి నుండి పరారయ్యాడు.

*పోలీసుల అద్భుత దర్యాప్తు:*
ఘటనా స్థలంలో మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే, భువనగిరి డీఎస్పీ బి. రవీందర్, భువనగిరి రూరల్ సీఐ ఎన్. చంద్రబాబు, బొమ్మలరామారం ఎస్ఐ బి. శ్రీశైలం బృందం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆశ్రయించింది. వివిధ జిల్లాల్లో నమోదైన మిస్సింగ్ కేసుల డేటాను పరిశీలించారు. ఘటనా స్థలం పరిసరాల్లోని సెల్ టవర్ లోకేషన్లు, మొబైల్ డేటా విశ్లేషణ చేశారు.
సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేసి నిందితుడిని గుర్తించారు.
*అరెస్ట్ – రికవరీ:*
మంగళవారం తెల్లవారుజామున ఆల్వాల్‌లోని శివనగర్ కాలనీలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన *యాక్టివా బైక్ (TS-08-JV-2293)* మృతుడికి చెందిన *వివో మొబైల్ ఫోన్‌ను* స్వాధీనం చేసుకున్నారు.
*ఎస్పీ అభినందనలు:*
ఎలాంటి ఆధారాలు లేని కేసును కేవలం సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించి నిందితుడిని పట్టుకున్న భువనగిరి రూరల్ సిఐ చంద్రబాబు, ఎస్ఐ శ్రీశైలం, పోలీసు సిబ్బందిని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ప్రత్యేకంగా అభినందించారు.