రైతులకు అధిక ఆదాయం అందించే పంటలపై దృష్టి సారించాలి : భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
జిల్లాల్లో వ్యవసాయ, ఉద్యాన శాఖల సమన్వయంతో సాగు విధానాల్లో విప్లవాత్మక మార్పులు రావాలని, ముఖ్యంగా రైతులకు అధిక ఆదాయం అందించే పంటలపై దృష్టి సారించాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
మంగళవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా భువనగిరి నియోజకవర్గ స్థాయి ఉద్యాన రైతుల సమావేశం నకు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పంటల మార్పిడి, ప్రత్యామ్నాయ పంటల సాగులో భాగంగా ఆయిల్ ఫామ్ యొక్క ప్రాధాన్యతను రైతులకు సవివరంగా వివరించారు. వరి పంట నుండి రైతులు ఆయిల్ పామ్ మరియు ఉద్యాన పంటల సాగు వైపు మొగ్గు చూపాలని తెలియజేయడం జరిగింది. రైతుల తోటలలో క్షేత్ర స్థాయి పర్యటన చేయించి రైతుల నమ్మకాన్ని కూడగట్టుకుని ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులలో నుండి నాయకులను తయారు చేసి ఆయిల్ పామ్ సాగును ఒక ఉద్యమం ల ముందుకు తీసుకువెళ్లాలని ఆదేశించారు.
భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంట యొక్క ప్రాధాన్యతను మరియు ఆయిల్ పామ్ సాగు ద్వారా వంట నూనెల దిగుమతులను తగ్గించుకోవడం ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఆదా చేసుకోవచ్చు అని, తద్వారా రైతులకు లాభాలు చేకూరుతాయని వివరించడం జరిగింది. ఉద్యాన పంటల సాగుతో ఒక రూపాయి పెట్టుబడికి 3 రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు 7 % మాత్రమే అయినప్పటికీ దేశ GDP కి ఉద్యాన పంటల ఉత్పత్తులు 25% సమకూరుస్తున్నాయని తెలిపారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర రావు మాట్లాడుతూ ఆయిల్ పామ్ మరియు ఉద్యాన పంటలు సాగుకు మంచి భవిష్యత్తు ఉందని ఈ పంటల సాగు ద్వారా రైతులు ఆదాయాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారిణి మాధవి మాట్లాడుతూ నియోజకవర్గస్థాయిలో గత సంవత్సరం సాధించిన ఉద్యాన ప్రగతిని, ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన వివిధ రకాల ఉద్యాన పథకాలను వాటి యొక్క రాయితీలను రైతులందరికీ తెలియజేశారు. కొంతమంది ఆదర్శ రైతులు వారి యొక్క అనుభవాలను ఉద్యాన పంటల సాగు వివరాలను ఇతర రైతులకు తెలియజేసి ఉద్యాన పంటల వైపు మళ్లించేలా ప్రోత్సహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కో-ఆపరేటివ్ అధికారిమురళి, జిల్లా మార్కెటింగ్ అధికారి , జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆవేజ్ చిస్తీ, భువనగిరి మున్సిపల్ చైర్మన్ శ్రీవాణి, వైస్ చైర్మన్ మంజుల, అగ్రికల్చర్ ఏడీఏలు ఉద్యాన అధికారులు వ్యవసాయ అధికారులు ఆయిల్ ఫెడ్ సిబ్బంది మైక్రో ఇరిగేషన్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.