ఈనెల 7న భువనగిరిలో జరుగు మేడే ముగింపు సభను జయప్రదం చేయండి : సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
ఈనెల 7న గురువారం భువనగిరి ప్రిన్స్ చౌరస్తా లో మే డే ముగింపు వారోత్సవాల సందర్భంగా జరిగే ముగింపు సభను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం బ్రాహ్మణపల్లి రోడ్డు చౌరస్తాలో సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో ముగింపు సభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కొట్లాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చి కార్మికులను నయా బానిసలుగా మార్చేసి యాజమాన్యాలకు, పెట్టుబడిదారులకు యదేచ్ఛగా శ్రమ దోపిడీ చేసేందుకు వీలుగా చర్యలు తీసుకుందని అన్నారు. ఈనెల 7న భువనగిరి ప్రిన్స్ చౌరస్తాలో మే డే వారోత్సవాల ముగింపు సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేశామని అన్నారు. ఇట్టి సభకు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. మల్లికార్జున్ లు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారని తెలిపారు. లేబర్ కోడ్స్ రద్దయ్యేంతవరకు కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల మధ్యన మతం పేరుతో, కులం పేరుతో విభజనలు చేస్తూ కార్మికులను ఐక్యం గాకుండా సెంటిమెంట్ రాజకీయాలు చేస్తుందని అన్నారు. నిన్ననే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చినవి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా బిజెపి ప్రభుత్వం మరిన్ని భారాలు కార్మికుల పైన, ప్రజల పైన వేసేందుకు సిద్ధమవుతుందని అన్నారు. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధరను పెంచిందన్నారు. రానున్న కాలంలో అన్ని రకాల నిత్యావసర వస్తువుల పైన ధరలు పెరిగే ప్రమాదం ఉందని అన్నారు. సంపద సృష్టిస్తున్న కార్మికులకు కార్మికులకు కనీస వేతనం 26000 చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయట్లేదని అన్నారు. అదే కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల రూపాయలని సబ్సిడీల పేరుతో, అప్పుల పేరుతో మాఫీ చేస్తుందని అన్నారు. బలిసినోడికి ఓ న్యాయం, పేదోడికి ఓ న్యాయం చేస్తుందని అన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులంతా ఐక్యంగా పోరాటాలు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పొట్ట యాదమ్మ, మండల కన్వీనర్ బండారు శ్రవణ్, నాయకులు ఓవల్దాస్ సతీష్, బండారు శ్రీరాములు, గాడి శ్రీనివాస్, నాంపల్లి భాస్కర్, బసవయ్య, ఈశ్వరమ్మ, మైసమ్మ, లింగమ్మ, దేవమ్మ, బిక్షపతి, రఘుపతి పాల్గొన్నారు.