ఆహార తయారీలో వ్యక్తిగత పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి : మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్
ముద్ర ప్రతినిధి, యాదాద్రిభువనగిరి :
ఆహార తయారీలో వ్యక్తిగత పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని వీధి వ్యాపారులు, పాఠశాలల మధ్యాహ్న భోజన నిర్వాహకులు వినియోగదారులకు, ‘సర్వ్ సేఫ్ ఫుడ్’ శిక్షణ కార్యక్రమం మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ప్రారంభమైంది. నాస్వి, నెస్లే ఇండియా, ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ మంజులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడుతూ ఆహార తయారీలో వ్యక్తిగత పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, శాస్త్రీయమైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆహార భద్రతా నియమిత అధికారి పి. స్వాతి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఆనంద్ ఎన్. రావు, జిల్లా ఆహార భద్రతాధికారి (ఇన్‌చార్జ్) ఎన్. శివ శంకర్ రెడ్డి పాల్గొని ఆహార భద్రత చట్టాలు, నిబంధనలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఆహార పదార్థాల నిల్వ, వంట గదుల పరిశుభ్రత, సురక్షితమైన పంపిణీ పద్ధతులపై వారు వ్యాపారులకు దిశానిర్దేశం చేశారు. మొత్తం మూడు రోజుల పాటు సాగే ఈ బృహత్తర శిక్షణ కార్యక్రమంలో ప్రతిరోజూ 100 మంది చొప్పున మొత్తం 300 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు. మొదటి రోజు జరిగిన సెషన్‌లో 100 మంది వీధి వ్యాపారులు మరియు ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట నిర్వాహకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె. చంద్రప్రకాష్ రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణ, నెస్లే ఇండియా సీనియర్ మేనేజర్ వసీం అహ్మద్, నాస్వి ప్రతినిధి రౌషన్ కుమార్, శిక్షకులు రాజ్‌కుమార్ పాల్గొన్నారు.