ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ లోని చింతల్ బస్తీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్ చల్ చేశారు. ఈ మేరకు బుధవారం అధికారులు షాదన్ నుంచి చింతల్ బస్తీకి వచ్చే మార్గంలో కూల్చివేతలు చేపడుతుండగా దానం నాగేందర్ వారిని అడ్డుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధినైనా తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై మండిపడ్డారు. ఎక్కడి నుంచో వచ్చిన వారు తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే దానం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుత విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మురికివాడల జోలికి వెళ్లకూడదని ముందే చెప్పానన్నారు. జలవిహార్, ఐమ్యాక్స్ లాంటివి చాలా ఉన్నాయని, వాటిని కూల్చుకోవాలని సూచించారు. పేదల ఇండ్లను కూల్చడం సరికాదని దానం నాగేందర్ అన్నారు.