Take a fresh look at your lifestyle.

డంకా భజాయించిన కాంగ్రెస్…!

– మహబూబ్ నగర్ మేయర్ పీఠం పై ముదిరాజ్ ఆడబిడ్డ
– ఆశావహులకు ఝలక్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం
– ముదిరాజ్ లకే ఇవ్వాలని చక్రం తిప్పిన ఎమ్మెల్యే యెన్నం, డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్
– ఎవరూ ఊహించని కార్పొరేటర్ కు దక్కిన మేయర్ పదవి
– సీనియర్ నేత సురేందర్ రెడ్డి కి దక్కిన డిప్యూటీ మేయర్ పీఠం
– పలు మున్సిపాలిటీ లలో ఎక్స్ అఫిషియో ఓటు తో చైర్మన్ పీఠం కైవసం


………………………………………
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
………………………………………..
ఊహించని మలుపులు…. ఊహకందని ఎంపిక…రెండు రోజులుగా ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సాగిన మహబూబ్ నగర్ మేయర్ ఎన్నిక. ఎట్టకేలకు ఎవరూ ఊహించని కార్పొరేటర్ దక్కిన మేయర్ పీఠం. ఎంతో ఉత్కoఠ నెలకొన్నా చివరికి ముదిరాజ్ ఆడబిడ్డకు మేయర్ పదవి లభించింది. దీంతో ఇంతకాలం మేయర్ పీఠం పై ఆశ పెట్టుకున్న వారు ఒక్క సారిగా ఖంగుతిన్నారు. రాత్రి దాకా పదవి వస్తుందని ఆశించిన అభ్యర్థులకు పొద్దెక్కగానే సీన్ రివర్స్ అయింది. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ రాత్రికి రాత్రే చక్రం తిప్పి ఆశావహులకు ఝలక్ ఇచ్చారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ లోని 3 డివిజన్ కు చెందిన గుమాల్ మమత నూ మేయర్ గా ఎంపిక చేశారు. ఉద్రిక్తల మధ్య మేయర్ ఎంపిక ఏకగ్రీవమైంది. 11 డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికైన మారెపల్లి సురేందర్ రెడ్డి కి డిప్యూటీ మేయర్ పదవి దక్కింది. ఎమ్మెల్యే కు అత్యంత సన్నిహితునిగా ఉన్న సురేందర్ రెడ్డి డిప్యూటీ గా ఎన్నిక లాంచనమైంది.ఇది అందరూ అనుకున్న విధంగానే ఎంపిక జరిగింది. కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన మైనార్టీ లు, స్వతంత్రులు డిప్యూటీ మేయర్ పదవి ఆశించినా ఫలితం దక్కలేదు. వారికి ఇతర పదవుల్లో ప్రాధాన్యం కలిపిస్తామని పార్టీ అభయం ఇచ్చినట్లు సమాచారం.ఏది ఏమైనా ఎమ్మెల్యే యెన్నం తన మార్క్ రాజకీయాన్ని మేయర్ ఎంపిక లో కనపడింది.మేయర్ పదవి మొదటి నుంచి ఆశించిన ఆనంద్ గౌడ్ నూ పూర్తిగా కట్టడి చేశారు. ఆయన తన భార్య కు మేయర్ పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో శంషాబాద్ రిసార్ట్ లో తీవ్ర గొడవ జరిగింది. వెంటనే పోలీసులు ఆనంద్ గౌడ్ నూ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆయనకు నచ్చజెప్పి గొడవ చేస్తే మీకే నష్టం జరుగుతుందని, ఇతర పదవుల్లో తప్పకుండ స్థానం కలిపిస్తామని భరోసా ఇవ్వడం తో ఆయన మౌనంగా ఉండిపోయారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వెంట క్యాంపు నుంచి నేరుగా మున్సిపాలిటీ కార్యాలయానికి ఆనంద్ గౌడ్ వచ్చారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చివరకు ఎలాంటి గొడవలు లేకుండానే ప్రశాంతంగా మేయర్ ఎన్నిక జరిగింది.తొలి మేయర్ పీఠం ముదిరాజ్ లకు దక్కడం తో ఆ వర్గాలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ముదిరాజ్ ఆడబిడ్డను తొలి మేయర్ గా ఎంపిక చేసిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు ముదిరాజ్ సంఘం కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
……………………………………..

గద్వాల లో కాంగ్రెస్సే కింగ్ :
………………………………….
గద్వాల మున్సిపాలిటీ ఎన్నికలు రసవత్తరంగా ముగిశాయి. చివరి వరకు దోబూచులాడిన విజయం కాంగ్రెస్ పార్టీ కే దక్కింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠం దక్కాలంటే ఒకే అభ్యర్థి అవసరం ఉండేది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకుంటే చైర్మన్ పదవి కాంగ్రెస్ కే వస్తుంది. కానీ ఆయన బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే గా ఉన్నానంటూ ఇది వరకే ప్రకటించారు. కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థులకు రక్షణ కవచంగా పనిచేశారు. చివరకు ఎంపీ మల్లు రవి తన ఎక్స్ అఫిషియో ఓటును ఆమన్ గల్ నుంచి గద్వాల కు మార్చుకున్నారు. దీంతో ఆయన తన ఓటును గద్వాల మున్సిపాలిటీ లో ఉపయోగించుకున్నారు. ఎంపీ ఓటు తో కాంగ్రెస్ కు మేజిక్ ఫిగర్ దాటడం తో చైర్మన్ పదవి కాంగ్రెస్ కు దక్కింది.అలంపూర్ లో కాంగ్రెస్ పార్టీ కి 5,బీ ఆర్ ఎస్ కు 5 రావడం తో ఇక్కడ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే విజయుడు తన ఎక్స్ అఫిషియో ఓటు తో బీ ఆర్ ఎస్ మేజిక్ ఫిగర్ దాటడం తో చైర్మన్ పదవి దక్కింది. నారాయణ పేటలో బీజేపీ ఎంపీ డీకే అరుణ ఎక్స్ అఫిషియో ఓటు తో బీజేపీ చైర్మన్ పీఠం పొందింది. అమరచింత లో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన బీ ఆర్ ఎస్ కౌన్సిలర్ కు చైర్మన్ పదవి వరించింది. ఇక్కడ కూడా మక్తల్ ఎమ్మెల్యే, మంత్రి వాకిటి శ్రీహరి ఎక్స్ అఫిషియో ఓటుతో చైర్మన్ పదవి కాంగ్రెస్ వశం అయింది. వనపర్తి మున్సిపాలిటీ లో చైర్ పర్సన్ పదవి ఆశించి భంగపడిన చీర్ల రజని తన కౌన్సిలర్ పదవికి, కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేశారు. ఈమె వనపర్తి లోని మూడవ వార్డు నుంచి కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. కొల్లాపూర్, నాగర్ కర్నూల్, భూత్పూర్, దేవరకద్ర, కొడంగల్,మద్దూర్, కోస్గి, కొత్తకోట,మక్తల్ మున్సిపాలిటీ లలో కాంగ్రెస్ అభ్యర్థులు చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం తో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పట్టు నిలుపుకుంది.ఒకప్పుడు కాంగ్రెస్ కు కాంచుకోటగా ఉన్న ఉమ్మడి జిల్లా లో మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం తో ఇక్కడి మంత్రులు,ఎమ్మెల్యే లు మున్సిపాలిటీ ఎన్నికలను సవాల్ గా తీసుకుని సఫలం చెందారు.

Leave A Reply

Your email address will not be published.