Take a fresh look at your lifestyle.

రైతు సంక్షేమం పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం- రైతు మహాధర్నాలో బీజేఎల్పీ నేత ఏలేటి

 

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:

ఆరుగాలం కష్టపడి పండించిన పంటల కొనుగోళ్లలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రైతాంగానికి తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై మహా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతు కష్టానికి కన్నీరు మిగిల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. 141 లక్షల టన్నుల ధాన్యం పండితే, 90 లక్షల టన్నులు కొంటామని ప్రకటించారన్నారు. ఐతే ఇప్పటివరకు కేవలం 14 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసి రికార్డు కొనుగోళ్లు అంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు. కళ్లముందే పంట తడుస్తున్నా రైతును దళారుల దయకు వదిలేసిందని అర్పించారు. వరి కొనుగోళ్లలో వైఫల్యం, మక్కజొన్న రైతుకు క్వింటాల్‌కు వందల రూపాయల నష్టం, హమాలీ లోడింగ్ పేరుతో ప్రతి బస్తాకు అక్రమ వసూళ్లు …ఇవి పాలన విజయాలు కాదు, రైతు రక్తాన్ని పిండే దోపిడీ అన్నారు. “అభయహస్తం” అన్న కాంగ్రెస్ చేయి, రైతు గొంతు నొక్కే కబంధ హస్తంగా మారిందన్నారు. రైతు కన్నీరు ఈ ప్రభుత్వాన్ని క్షమించదన్నారు. బీజేపీ రైతు పక్షాన పోరాటం ఆపదని రైతాంగానికి హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు రావుల రాం నాథ్, నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.