Take a fresh look at your lifestyle.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అల్పాహారం… జిల్లా విద్యాధికారి కె. రాము… బడిబాట ర్యాలీలో పాల్గొన్న డీఈవో….

 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల :
వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుంచి తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా అందించనున్నట్లు జిల్లా విద్యాధికారి కె. రాము తెలిపారు. జగిత్యాల పట్టణంలోని ఓల్డ్ హై స్కూల్‌లో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యతో పాటు సమగ్ర అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చారని, 3 వేల మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని తెలిపారు. అలాగే ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 9 వస్తువులతో కూడిన కిట్‌ను విద్యార్థులకు అందజేయనున్నట్లు చెప్పారు.
జిల్లాలో కొత్తగా 78 ప్రీ-ప్రైమరీ పాఠశాలలు, 3 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ప్రైవేట్ పాఠశాలల్లో వేలాది రూపాయలు ఫీజులు చెల్లించి ఆర్థిక భారం మోసే బదులు, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి చంద్రకళ, పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షులు బోయినిపెల్లి ఆనంద్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.