- పెద్ద ప్యాకేజీ ఇస్తే బీజేపీ నేతలు బీఆర్ఎస్‌తో కలిసిపోతారు.
- గతంలో బీఆర్ఎస్‌తో కలిసి పని చేశారు.
- అందుకే చాలా ఎన్నికల్లో ఓడిపోయారు.
- బీజేపీ వాళ్లు ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేయాలో డిసైడ్ చేసేది బీఆర్ఎస్సే.
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో కలకలం సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ నేత కవిత “పెద్ద ప్యాకేజీ వస్తే బీజేపీ నేతలు బీఆర్ఎస్‌తో కలిసిపోతారు” అని చేసిన ఆఫ్ ది రికార్డ్ వ్యాఖ్యలు నిజమేనని తాను భావిస్తున్నట్లు రాజాసింగ్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేయాలో ఇతర పార్టీ నేతలే నిర్ణయించారని, ఇదే కారణంగా గత ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగిందని రాజాసింగ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టి ఇతర పార్టీలతో కుమ్మక్కవడం వల్లనే బీజేపీ అధికారంలోకి రాలేకపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేతల కుమ్మక్కుతో పార్టీకి నష్టం జరుగుతుందని అన్నారు. ప్రతి ఎన్నికలో బీజేపీ నేతలు ఇతర పార్టీలతో కుమ్మక్కవడం వల్ల పార్టీకి తీవ్ర నష్టాలు జరుగుతున్నాయని రాజాసింగ్ మండిపడ్డారు. ఈ కుట్రలే బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రధాన అడ్డంకిగా మారాయని అన్నారు. పార్టీ నేతల లోపాలను ఎత్తిచూపితే సస్పెండ్ చేస్తారన్న భయంతోనే పార్టీ క్యాడర్ మౌనంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ పద్దతి పార్టీలో స్వేచ్ఛా భావానికి విఘాతమని అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనూ, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనూ కొంతమంది నేతలు అధికార పార్టీలకు తొత్తులుగా మారారని ఆయన దుయ్యబట్టారు. పార్టీని బలోపేతం చేయాలంటే, అలాంటి పాత స్క్రాబ్‌ను తొలగించాల్సిందే అని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా కొందరు సీనియర్ నాయకులను ఉద్దేశించినవిగా భావిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు బీజేపీ రాష్ట్ర నేతలకు మింగుడు పడడం లేదు. కవిత వ్యాఖ్యలపై ఎవరూ స్పందించకూడదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో, ఈ వ్యాఖ్యలపై పార్టీ కేంద్ర నాయకత్వం ఎలా స్పందిస్తుందో ఆసక్తికరంగా మారింది. రాజాసింగ్ వ్యాఖ్యలు బీజేపీలో పెరుగుతున్న అసంతృప్తిని బహిర్గతం చేస్తున్నాయి. దాపరికం లేకుండా రాజాసింగ్ చేసిన ఈ విమర్శలు పార్టీకి తలదన్నే ప్రశ్నల్ని రేపుతున్నాయి. భాజపా నేతలలో విభేదాలు ఇలా కొనసాగితే, రాష్ట్ర రాజకీయాలపై దీని ప్రభావం తప్పదనిపిస్తోంది.