- భారత్లో ఉండిపోయేందుకు నైజీరియన్లు వ్యూహాన్ని ఎంచుకున్నారు.
- ఇప్పటి వరకు ఏకంగా 498 మంది తమపై కేసులు నమోదు.
- నకిలీ పాస్ పోర్టులతో భారత్ లోకి ప్రవేశిస్తున్నారు.
- నగరంలో నేరాలు చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్నాం.
- హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ లో ఉండేందుకు నైజీరియన్లు పెద్ద కుట్రకు తెరలేపారని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. డిపోర్టు చేసిన తర్వాత కూడా చాలా మంది నకిలీ పాస్ పోర్ట్ లతో ఇండియాలోకి ప్రవేశిస్తున్నారని వెల్లడించారు. అలాంటి వాళ్లను కూడా అరెస్ట్ చేస్తున్నట్లు వివరించారు. గురువారం హైదరాబాద్ లో జోనల్ సైబర్ సెల్స్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నైజీరియన్లను వాళ్ల దేశానికి డిపోర్ట్ చేస్తారని భయంతో ఏదో ఒక కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారని సంచలన విషయాన్ని తెలిపారు. చివరికి 498 కేసుల్లో వారు ఉద్దేశపూర్వకంగా కేసు పెట్టించుకుంటున్నారని వెల్లడించారు. నైజేరియన్స్ పై కేసు నమోదు అయితే చట్టపరంగా డిపోర్ట్ చేయలేమని స్పష్టం చేశారు. వారిపై కేసు ట్రయల్ పూర్తి చేసి క్లోజ్ అయ్యే వరకు డిపోర్టు చేయలేమని వివరించారు. బంగ్లాదేశ్ కి చెందిన పౌరులు కూడా శరణార్థులుగా ఇక్కడికి వస్తున్నారని.. ఈ వ్యవహారాన్ని కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అడ్డుదారుల్లో ఇక్కడ ఆధార్ పొందుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో సాంకేతిక సమస్యలు ఉన్నాయన్నారు.
- సమీర్ కేసుపై ఎన్‌ఐఏ దర్యాప్తు.
ఉగ్రవాద లింక్స్ ఉన్న సమీర్ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తుందని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఎన్‌ఐఏ నాలుగు చోట్ల సోదాలు చేసిందని తెలిపారు. ఎన్‌ఐఏ విచారణ, సోదాలకు హైదరాబాద్ పోలీసుల సహకారం అడిగితే చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ లో సమీర్ తో ఇంకా ఎవరెవరికి లింక్స్ ఉన్నాయనే అంశాన్ని ఎన్‌ఐఏ దర్యాప్తులో బయటికి వస్తాయని తెలిపారు. ఫోన్ టాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుందని ఆయన వివరించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామన్నారు. ప్రస్తుతానికి ఉన్న చర్యలు అన్ని హోల్డింగ్ లోకి వెళ్లిపోతాయన్నారు. కొత్త పాస్‌పోర్టు జారీ పక్రియ మొత్తం కూడా విదేశీ వ్యవహారాల శాఖ చూసుకుంటుందని వివరించారు. పాస్‌పోర్టు ఎప్పుడు ఎలా జారీ చేస్తారనే విషయాన్ని తాము కూడా తెలుసుకోవాలన్నారు. ఇంటర్పోల్, డిస్పోర్ట్ ఇతర ఇతర చర్యలు అన్ని కూడా హోల్డింగ్ లోకి పోతాయని వెల్లడించారు.