2011లో కాంగ్రెస్ చేసిన తప్పే బీజేపీ చేస్తోంది
బీజేపీ కుట్రను బీఆర్ఎస్ ఖండించలేదు
జనగణనపై కేంద్రానికి నివేదిక ఇస్తాం

ముద్ర, తెలంగాణ బ్యూరో :
కేంద్రంలోని బీజేపీ సర్కార్ కులగణన విషయంలో దేశ ప్రజలను మోసం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. దేశవ్యాప్తంగా త్వరలో నిర్వహించతలపెట్టిన జరగబోయే జనగణన డాక్యుమెంట్‍లో…. గతంలో ఉన్న మాదిరిగానే ఎస్సీ, ఎస్టీ కేటగిరి పెట్టి ఓబీసీ, ఇతర కులాలను ఇతరులు అని పొందుపర్చారని విమర్శించారు. దీంతో కులం దాని కింద ఉండే ఉప కులాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‍లోని ఖాజా మెన్షన్ లో కేంద్ర జన గణనలో కులగణన పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవిత రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభానికి ముందు అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూల మాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. 2011 లో రూ. 4500 కోట్ల తో కాంగ్రెస్ జనగణనలో ఏ తప్పు చేసిందో బీజేపీ కూడా అదే చేస్తోందని ఆరోపించారు. ఇప్పుడు రూ. 11వేల కోట్లతో చేపట్టబోయే జనగణనలో బీసీలను మోసం చేసే కుట్ర జరుగుతోంది. మమ్మల్ని గుర్తించటమే లేదంటే మేమంటే మీకు లెక్కలేనట్లే?భారతదేశంలో కుల వ్యవస్థ ఎంత కన్ఫ్యూజన్ గా ఉంటుందో మనందరికి తెలుసని చెప్పారు. ఓ కమ్యూనిటీ ఒక రాష్ట్రంలో ఒక కేటగిరిలో ఉంటే మరో రాష్ట్రంలో ఇంకో కేటగిరిలో ఉంటోందన్నారు. అలాంటిది 56 శాతం ఉన్న ఓబీసీ కమ్యూనిటీ విషయంలో ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో ఆలోచించాలని ప్రశ్నించారు. జనగణన చేసినప్పుడే ఏ వర్గం ఎంత ఉంది? వారికి బడ్జెట్, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయన్నది తెలుస్తుందన్నారు. కులగణనకు కేంద్రం ముందుకు రావటంతో సంతోషించామన్న ఆమె.. ఎప్పుడైతే డాక్యుమెంట్ విడుదల చేశారో అప్పుడే కేంద్రం బుద్ది బయట పడిందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అగ్రవర్ణాల్లోని పేదలకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఇస్తున్నారని చెప్పారు. వీళ్లు ఏ కేటగిరిలోకి వస్తారో అనేది ఈ కులం అనే కాలమ్ తో క్లారిటీ రాదన్నారు. బీజేపీ తెచ్చిన సెన్సస్ డాక్యుమెంట్ చాలా గందరగోళంగా ఉందనీ ఇదంతో ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని చెప్పారు. తెలంగాణలోనూ చర్చ జరిగి మన రాష్ట్ర అభిప్రాయాలను కేంద్రానికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో ఉన్న కులాలు వాటి కింద ఉన్న ఉపకులాల డేటాను తెలంగాణ జాగృతి తరఫున సేకరించి కేంద్రానికి పంపుతామని కవిత వెల్లడించారు. ఇందుకు అందరి మద్దతు కావాలని కోరారు. నిజానికి ఈ పని రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి కానీ అలా చేయడం లేదన్నారు. ఈ విషయంలో రాజకీయ పార్టీల పాత్ర చాలా కీలకంగా ఉంటుందని కానీ సెన్సస్ డాక్యుమెంట్ మీద బీఆర్ఎస్, కాంగ్రెస్, ఏమీ మాట్లాడటం లేదన్నారు. ఈ పార్టీలన్నీ ఈ విషయంలో తమ వైఖరి తీసుకోవాలని డిమాండ్ చేశారు.