ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
మే 12న పరీక్ష
ముద్ర, హైదరాబాద్ :
రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక ఎడ్ సెట్-2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది పరీక్ష నిర్వహణ బాధ్యతలను స్వీకరించిన కేయూ, దరఖాస్తుల ప్రక్రియ నుంచి ఫలితాల విడుదల వరకు పూర్తి షెడ్యూల్‌ను వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ అధికారులు ఖరారు చేశారు. మే 12న తెలంగాణ వ్యాప్తంగా టీజీ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థుల సంఖ్యను బట్టి ఉదయం , సాయంత్రం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష పూర్తయిన మూడు రోజుల్లోనే అంటే మే 15న అధికారులు ప్రాథమిక కీని విడుదల చేస్తారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే స్వీకరించిన అనంతరం, మే 30వ తేదీన తుది ఫలితాలను వెల్లడించనున్నారు. బీఈడీ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ నెల 23 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా, అభ్యర్థులు ఏప్రిల్ 15 వరకు ఎలాంటి అపరాధ రుసుము చెల్లించకుండా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. గడువు ముగిసిన తర్వాత కూడా అభ్యర్థుల సౌకర్యార్థం అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును అధికారులు కల్పించారు. రూ. 250 జరిమానాతో ఏప్రిల్ 23 వరకు, రూ. 500 ఫైన్‌తో ఏప్రిల్ 27 వరకు , రూ. వెయ్యి అపరాధ రుసుముతో ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు అనుమతించనున్నారు.