Take a fresh look at your lifestyle.

శోభాయమానంగా శ్రీవారి వసంతోత్సవం…

అంగరంగ వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం……. జల నారాయణ స్వామి వారికి మంగళహారతులు

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో శ్రీ అష్టలక్ష్మి మండపంలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పంచామృతములు, పసుపు, సుగంధ ద్రవ్యాలతో వేదమంత్రోచ్ఛారణలతో వసంతోత్సవ సేవను శోభాయ మానంగా అర్చక స్వాములు నిర్వహించారు.

శనివారంకలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రాతఃకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించారు. అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య సుగంధ భరితమైన పుష్పమాలలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. వేయి నామాల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి సహస్ర నామార్చన సేవ లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు.


అర్చక స్వాములు స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా గావించారు. భక్తులు శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆనంద పరవశులైనారు. ఆలయంలో సుమారు 5000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
సాయంత్రం శ్రీ స్వామి వారిని మాడవీధులలో శోభాయ మానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామస్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు.
అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో శనివారం సందర్భంగా జల నారాయణ స్వామి వారికి మంగళహారతులు సమర్పించారు.

Leave A Reply

Your email address will not be published.