Take a fresh look at your lifestyle.

రాహుల్ ను ప్రధానిగా చూడాలనుకోవడం మా హక్కు -కేంద్రమంత్రి బండి సంజయ్ కు పొన్నం కౌంటర్

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :

రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని ఆశించడం ఒక రాజకీయ పార్టీగా తమహక్కు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఎవరికి దక్కాలో నిర్ణయించేది ప్రజలేనన్నారు. అంతే తప్ప బండి సంజయ్.. లేదా మరో వ్యక్తి కాదన్నారు. దేశం కోసం ప్రధానమంత్రిని అవుతానని రాహుల్ గాంధీచేసిన వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్.. రాహుల్ పీఎం సీటుపై ఆశలు వదులుకోవాల్సిందేనంటూ సెటైర్లు వేశారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ప్రకటనలో కౌంటర్ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో పదవులు శాశ్వతం కావన్న పొన్నం.. అవి ప్రజల విశ్వాసంపై ఆధారపడి ఉంటాయని చెప్పారు. ఈ దేశానికి పట్టిన గ్రహణం ఎవరో ప్రజలకు తెలుసన్నారు. బీజేపీ పాలనలో గత 12 ఏళ్లుగా ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారన్నారు. పీఎం నరేంద్రమోడీ దేశాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టి తమాషా చూస్తున్నారనీ ఆరోపించారు. దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టిన మీరా మాట్లాడేది..? అని నిలదీశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన వ్యవస్థలు అస్తవ్యస్థంగా మారాయనీ ప్రభుత్వ రంగ సంస్థలు తెగనమ్ముతున్నారని ఆరోపించారు. విద్వేషాన్ని రెచ్చగొట్టి మైనార్టీ లను అణగారిన వర్గాలను బూచిగా చూపి బీజేపీ అధికారాన్ని చెలాయిస్తోందన్నారు. నిత్యం మతవిద్వేశాలు రెచ్చగొడుతూ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఈడి సీబీఐ కేసులతో విపక్ష ప్రభుత్వాలను కూలుస్తు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న రాజకీయం మీదేనని ధ్వజమెత్తారు.

Leave A Reply

Your email address will not be published.