Take a fresh look at your lifestyle.

దేశంలో తొలి క్వాంటం-సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్

 

అమరావతి వేదిక కావడంపై సీఎం చంద్రబాబు హర్షం
సైబర్ భద్రతలో కొత్త దశకు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం
సీ-డాట్ భాగస్వామ్యంతో ఎస్ఆర్ఎంలో ఆధునిక క్వాంటం పరిశోధన కేంద్రం
నెక్స్ట్ జనరేషన్ సైబర్ డిఫెన్స్‌కు హబ్‌గా అమరావతి
విద్యార్థులు, స్టార్టప్‌లకు ప్రపంచ స్థాయి టెక్నాలజీ అవకాశాలు

ముద్ర, అమరావతి :
దేశంలోనే తొలి క్వాంటం-సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్ అమరావతిలో ఏర్పాటు కానుండటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, భవిష్యత్ డిజిటల్ భద్రతకు ఇది కీలక అడుగుగా అభివర్ణించారు.

భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్, అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీలో ఈ టెస్ట్ బెడ్‌ను ఏర్పాటు చేస్తోంది. క్వాంటం కమ్యూనికేషన్, సురక్షిత నెట్‌వర్క్ వ్యవస్థలు, ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీలు, ఫోటోనిక్ మరియు ఆప్టికల్ సిస్టమ్స్ రంగాల్లో పరిశోధనలకు ఇది కేంద్రంగా మారనుందని సీఎం పేర్కొన్నారు.

ఏప్రిల్ 14న క్వాంటం కంప్యూటింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రారంభం తర్వాత అమరావతిలో టెలికమ్యూనికేషన్, ఐటీ, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో వేగంగా అభివృద్ధి జరుగుతోందని ఆయన తెలిపారు. నెక్స్ట్ జనరేషన్ సైబర్ డిఫెన్స్ సొల్యూషన్స్ అభివృద్ధికి అమరావతి కేంద్ర బిందువుగా మారబోతోందని వెల్లడించారు.

ఈ టెస్ట్ బెడ్ ద్వారా “మేక్ ఇన్ ఇండియా” సాంకేతికతలకు ప్రోత్సాహం లభించడంతో పాటు, సురక్షిత డిజిటల్ మౌలిక సదుపాయాల విషయంలో అమరావతికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఫ్రంటియర్ టెక్నాలజీస్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్, డీప్-టెక్ ఆవిష్కరణలకు అమరావతి ప్రముఖ కేంద్రంగా ఎదుగుతుందని చెప్పారు.

అలాగే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏపీ విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్‌లు, యువ ఆవిష్కర్తలకు ప్రపంచ స్థాయి సాంకేతికతల రూపకల్పనలో భాగస్వామ్యం అయ్యే అవకాశాలు లభిస్తాయని తెలిపారు. టెస్ట్ బెడ్ ఏర్పాటులో భాగస్వాములవుతున్న శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు, సంస్థలకు సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.