- ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు.
- ఎన్నికల నిర్వహణ జాప్యంపై కారణాలు చెప్పాలని ఆదేశం.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు జరుగుతోన్న జాప్యంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆ ఎన్నికలు సకాలంలో ఎందుకు నిర్వహించట్లేదో కారణం తెలపాలంటూ శుక్రవారం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కారణమెంటో తెలపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని మందలించింది. పాలకవర్గాలు లేకుండా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని నిలదీసింది. ఎన్నికల నిర్వహణకు జాప్యం ఎందుకు జరుగుతుందో వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొంది. రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి 26 తో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఆ ఎన్నికల నిర్వహణ విషయంలో దాఖలైన పిటిషన్ పై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ జాప్యంపై కారణాలు తెలపాలని ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ వచ్చే నెల 11వ తేదీకి వాయిదా వేసింది. మరో వైపు మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన హైకోర్టు..సెప్టెంబర్ 30న ఫలితాలు వెల్లడించాలని డెడ్ లైన్ విధించింది.ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టగా ఇంతలో మున్సిపల్ ఎన్నికల విషయంలో నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. దీంతో తాజా పరిణామాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.