- మరోసారి నిరసనలకు సిద్ధమవుతోన్న జూనియర్ డాక్టర్లు.
- సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ నిర్లక్ష్య తీరుకు నిరసనగా నిర్ణయం.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు (జూడాలు) మరో ఆందోళనకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. లేనట్లయితే జూన్ 30 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీలలో ధర్నాలు చేస్తామని ప్రకటించారు.స్టైఫండ్ అంశంతో పాటు, అధ్యాపకుల రిక్రూట్మెంట్, ఇతర సౌకర్యాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఇటీవల జూడాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు.ఆ సమయంలో మంత్రి దామోదర రాజనర్సింహ వారితో చర్చలు జరిపారు. వారి సమస్యలు సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అప్పటి వరకు కొన్ని రోజులు ఓపిక పట్టాలని సూచించారు. మంత్రి చర్చలతో జూడాలు శాంతించారు. కానీ సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయాలు, ప్రయత్నాలు లేకపోవడంతో మరోసారి ధర్నాలకు దిగాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందోననే ఆసక్తి నెలకొన్నది.