- మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో 25శాతం సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు కేటాయించి, అమలు చేసేలా తగు చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బి వెంకటయ్యను కోరారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బి వెంకటయ్య తో పాటు కమిషన్ సభ్యులను మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కమిషన్ చైర్మన్ వెంకటయ్య, సభ్యులకు వినతి పత్రం సమర్పించి, పలు అంశాలను కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో పేర్కొన్నట్లు బీసీలకు 25శాతం మైనార్టీలకు నాలుగు శాతం ఎస్సీలకు 15 శాతం ఎస్టిలకు 10 శాతం సీట్లు జనాభా ప్రాతిపదికన ప్రైవేట్ పాఠశాలలో సీట్లు కేటాయించాలని, నిరుపేదలకు విద్యను మరింత చేరువ చేయాలని కోరారు. ఫీజు రెగ్యులేషన్ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఆయా పాఠశాలల్లోని మౌలిక వసతులు బోధన సౌకర్యాలను పరిగణలోకి తీసుకుంటూ నిర్ధారించే ఫీజుల వివరాలను జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల్లో ఏయే పాఠశాలల్లో ఏ మేరకు ఫీజు నిర్ణయించారో విద్యా సంవత్సరానికి ప్రారంభంలోనే ప్రకటించాలని, తద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్చాలో తెలుసుకొనే స్వేచ్ఛపూరిత వాతావరణాన్ని కల్పించాలని ఆయన విన్నవించారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ నిరుపేద దళితులకు తమ హక్కుల సాధనలో న్యాయం జరగడం లేదన్నారు. రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన దళిత యువతి కంటే సునీత నూతన జిల్లాల ఏర్పాటుకు పూర్వం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తన విద్యాభ్యాసం కొనసాగించిందని, అనంతరం ఐఈఆర్పి రాత పరీక్ష రాసి ఉత్తమ ర్యాంకు సాధించినప్పటికీ నాన్ లోకల్ అంటూ ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించడంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు సైతం సునీతకు ఉద్యోగం ఇవ్వాలని తీర్పు చెప్పినప్పటికీ కూడా నేటికీ హైకోర్టు ఉత్తర్వులు సైతం అమలుకు నోచుకోలేదు. ఈ అంశంపై ప్రత్యేక చొరవ తీసుకొని బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన వీఆర్ఏ ఎన్నికల విధుల్లో ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో హై కోర్టు ను ఆశ్రయించగా, అర్హతకు అనుగుణంగా ఏదైన ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోర్టు సూచించగా, వీ ఆర్ఏ వ్యవస్థ రద్దు అయిందంటూ ప్రభుత్వం సమాధానం ఇవ్వడం తో అన్ని అర్హతలు ఉండి కూడా దళితుడికి న్యాయం జరగకపోవడం బాధాకరమని అన్నారు. ఈ రెండు అంశాలను పరిశీలించాలని కమిషన్ చైర్మన్, సభ్యులకు జీవన్ రెడ్డి విన్నవించగా, జీవన్ రెడ్డి తమ దృష్టికి తీసుకువచ్చిన రెండు అంశాలను ప్రత్యేకంగా పరిశీలించి, సమస్య పరిష్కరించి, న్యాయం చేస్తామని కమిషన్ సభ్యులు హామీ ఇచ్చారు. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్ల కేటాయింపు చేయడంతో పాటు అమలు చేసే విధంగా, భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీలకు కేటాయించిన రిజర్వేషన్ల కు అనుగుణంగా ప్రైవేట్ పాఠశాలల్లో సీట్ల కేటాయింపు చేపట్టేలా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని కమిషన్ సభ్యులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపీ ధర రమేష్ బాబు, బండ శంకరు తదితరులు పాల్గొన్నారు.
