Take a fresh look at your lifestyle.

4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి

  • ఎనిమిది గంటల పని దినాన్ని కొనసాగించాలి.
  • సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని డిమాండ్.

ముద్ర ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం : ఖమ్మంలో మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కార్మికులు వాడవాడలా ఎర్ర జెండాలను ఎగుర వేశారు.సభలు సమావేశాలు నిర్వహించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసించారు.చికాగో అమరుల స్పూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. మేడే ఉత్సవాల్లో పాలోన్న సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేనివీరభద్రం నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి, ఎనిమిది గంటల పని దినాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలుకు తూట్లు పొడిచే చట్టాలు తెస్తే కార్మిక వర్గం మొత్తం తిరగబడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.గురువారం సీపీఎం ఖమ్మం త్రీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో భూక్యా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిదధిగా పాల్గొని ప్రసంగించారు.పెట్టుబడి దారి వర్గాలతో దేశంలో ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కుమ్మకై 44 కార్మిక చట్టాలను కుదించి కేవలం నాలుగు చట్టాలు చేస్తూ కార్మికుల హక్కులను కాల రాసిందని విమర్శించారు.వెంటనే ఆ చట్టాలను రద్దు చేసి, పాత చట్టాలను కొనసాగించక పోతే కార్మికులు, ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.బీజేపీ ప్రభుత్వం చేసిన నాలుగు చట్టాలలో కార్మికులకు హాని చేసే చట్టాలు ఎక్కువ ఉన్నాయన్నారు.ఒక ఫ్యాక్టరీలో పని చేసే కార్మికులు యూనియన్లు, సంఘాలు పెట్ట కుండా, తమ సమస్యలపై అధికారులకు వినతి పత్రం ఇవ్వ కుండా ఈ చట్టాలు నిరోధిస్తాయన్నారు. ఇలాంటి చట్టాలను వెనక్కి నెట్టక పోతే కార్మిక వర్గం మీద ఈ పెట్టుబడి దారి వర్గం మరింత దూకుడుగా ముందుకు పోతుందన్నారు. అందుకే ఈనెల 25న దేశ వ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపు నిచ్చాయని చెప్పారు. ముందుగా సీపీఎం దివంగత నేత యర్రా శ్రీకాంత్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.ఈ సభలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సాయిబాబా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీనివాస రావు, మాదినేని రమేష్, ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

  • పోరాటాలకు పునరంకితం కండి.
  • సీపీఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వర రావు.

139వ మేడే స్ఫూర్తితో భవిష్యత్తు పోరాటాలకు పునరంకితం కావాలని సీపీఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వర రావు పిలుపు నిచ్చారు. అనన్య త్యాగాలు, పోరాటాలు, బలిదానాలతో అనేక హక్కులు సాధించుకున్నామని, ప్రతి హక్కు వెనక పోరాటం దాగి ఉందని ఆయన అన్నారు.మేడేను పురస్కరించుకుని గురువారం స్థానిక సీపీఐ కార్యాలయంలో పువ్వాడ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వం స్వాతంత్య్రం తర్వాత కార్మికుల పక్షాన నిలబడి పోరాడింది సీపీఐ, ఏఐటియుసి మాత్రమేనన్నారు. ప్రస్తుత పాలకులు సంపన్న వర్గాల సేవలో తరిస్తున్నారని పేదలను పూర్తిగా – విస్మరించారని విమర్శించారు.పేదలు మరింత పేదలవుతున్నారని, సంపద కొంత మంది చేతుల్లో పొగుబడుతుందని, ఇది దేశ భవిష్యత్తుకే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజల హక్కుల పరిరక్షణ కార్మిక హక్కుల సాధన – ఎర్ర జెండాతోనే సాధ్యమవుతుందని ఎర్ర జెండా నేతృత్వంలో జరిగే పోరాటాలకు దన్నుగా నిలవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బిజి క్లెమెంట్, మహ్మద్ సలాం, తాటి వెంకటేశ్వరరావు, -పోటు కళావతి, సిహెచ్ సీతా మహాలక్ష్మి, మేకల శ్రీనివాసరావు, ఆర్టిసి ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పిల్లి రమేష్, జిల్లా సమితి సభ్యులు ఉన్నం రంగారావు, తాటి నిర్మల, యానాలి సాంబశివ రెడ్డి, నూనె శశిధర్, బోడా వీరన్న, ఎస్ కె సైదా తదితరులు పాల్గొన్నారు.

  • కార్మికులను విస్మరించి కార్పొరేట్ల సేవలో పాలక వర్గాలు.
  • మాస్ లైన్ జిల్లా కార్యదర్శి గోకేనేపల్లి వెంకటేశ్వరరావు.

పాలకవర్గాలు కార్మికులపై ప్రజలపై ధమన కాండం ప్రయోగిస్తూ కార్మిక వర్గానికి సామాజిక భద్రత లేకుండా వేతనాలు పెంచ కుండా హక్కులు కాలరాస్తున్నాయని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి గోకేనేపల్లి వెంకటేశ్వరరావు విమర్శించారు. విదేశీ పెట్టుబడులకు గేట్లు బార్ల తెరిచి కార్పొరేట్ వర్గాలకు పాద క్రాంత సేవలో మునిగి పోతున్నారని దుయ్య బట్టారు. గురువారం మేడేను పురస్కరించుకొని ఖమ్మం బైపాస్ రోడ్లో మాస్ లైన్ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓ వైపు కార్పొరేట్ వర్గాలకు 15 లక్షల కోట్ల రాయితీలు, కారు చౌకగా భూములు, మినరల్స్ అప్పగిస్తూ, మరో వైపు పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలపై కోత వేస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్లు బ్యాంకును లూటీ చేస్తుంటే, ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.చాలీ చాలని జీవితాలతో బతుకులు లాగుతున్న శ్రమ జీవులపై అనేక రకాల భారాలు మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కార్మిక వర్గం నిజ వేతనాలు పెంచి, అన్ని రకాల సౌకర్యాలు కల్పించక పోతే ప్రజల నుండి తిరుగుబాటు వస్తుందని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆవుల అశోక్, జి రామయ్య, సిహెచ్ శిరోమణి, ఝాన్సీ, మంగతాయి, శోభ, వెంకటేష్, కే శ్రీను, లక్ష్మణ్, సత్తార్, వెంకట కృష్ణ ,చందు లక్ష్మి, జాస్మిన్, రామారావు తదితరులు పాల్గొన్నారు.

  • చికాగో అమర వీరుల స్పూర్తితో పోరాటాలకు సిద్ధం కండి.
  • టీఏకేఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు దాసరి శ్రీను పిలుపు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చికాగో అమర వీరుల స్పూర్తితో సమర శీల పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య ( టీఏకేఎస్ ) ఖమ్మం జిల్లా అధ్యక్షులు దాసరి శ్రీను పిలుపు నిచ్చారు.గురువారం మేడేను పురష్కరించుకొని ఖమ్మం బస్ డిపో రోడ్డులోని జెండాల సెంటర్లో సంఘ పతాకాన్ని టీపీఎఫ్ రాష్ట్ర నాయకులు మోడెం వెంకన్నతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో దాసరి శ్రీను మాట్లాడుతూ కేంద్రం అసంఘటిత రంగ కార్మికులకు సమగ్రమైన చట్టం తేవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను తొలగించి, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కొడ్లను తీసుకొచ్చిందని చెప్పారు. పొరాడి సాధించుకున్న హక్కులను, చట్టాలను తుంగలో తొక్కి పార్లమెంటులో చర్చ లేకుండానే ఆమోదించిందని విమర్శించారు.వెంటనే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆ 4 లేబర్ కొడ్లను రద్దు చేయాలని శ్రీను డిమాండ్ చేశారు.పని స్థలాల్లో మహిళలకు మౌలికమైన సౌకర్యాలు కల్పించాలన్నారు.నేడు మహిళలకు పని భద్రత, రక్షణ లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.మూత బడిన పరిశ్రమలను తెరిపించి, యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర నాయకులు గోపగాని శంకర్ రావు, ఉద్యమ నాయకులు గుంతేటి వీరభద్రం, సేవాలాల్ సమితి రాష్ట్ర నాయకులు కిషన్ నాయక్, పీపుల్స్ జేఏసీ నాయకులు దేవిరెడ్డి విజయ్ రెడ్డి, యాదవ సంఘం రాష్ట్ర నాయకులు మెరుగు వెంకట రమణ, విద్యావంతుల వేదిక జిల్లా నాయకులు నరేందర్, వివిధ సంఘాల నాయకులు పల్లె బోయిన సోమరాజు, పద్మాచారి, జమ్మి వీర బాబు, తురక నాగేశ్వర రావు, దారా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.