- టీయూడబ్ల్యూజే ( ఐజేయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ.
ముద్ర ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం: నిత్యం మానసిక ఒత్తిడితో ఉండే జర్నలిస్టులు తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ సూచించారు.11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురష్కరించుకొని శనివారం ఖమ్మంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో యోగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ యోగ విద్యాలయం యోగా మాస్టర్ కోదండ రావు ఆధ్వర్యంలో వందలాది మంది యోగ సాధన చేశారు. అనంతరం యోగ సాధకులనుద్దేశించి రాంనారాయణ మాట్లాడుతూ యోగా సర్వరోగ నివారిణి అన్నారు. సిద్ధార్థ యోగ విద్యాలయ నిర్వాహకులు యోగా, ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించడాన్ని అభినందించారు. ప్రకృతి వైద్య నిపుణులు, అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత డాక్టర్ రామచంద్ర మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరికీ యోగ సాధన ఎంతో అవసరమన్నారు. యోగా అనేది భారతీయ సంస్కృతి మనకు అందించిన గొప్ప వరమని పేర్కొన్నారు. సిద్ధార్థ యోగ విద్యాలయం ద్వారా గత 20 ఏళ్లుగా నాలుగు రాష్ట్రాలలో 72 సెంటర్ల ద్వారా యోగ ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగస్వామ్యంగా చేసుకుని, ప్రకృతి విధానాన్ని అవలంభిస్తూ, ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిద్దార్థ యోగ విద్యాలయం నిర్వాహకులు లక్ష్మీ నారాయణ, కృష్ణ మూర్తి, వెంకన్న, వేణు తదితరులు పాల్గొన్నారు.
