నల్లజర్ల, జనవరి 1: సుప్రసిద్ధ జ్యోతిష్కులు , సింగరాజు పాలెం సిద్ధాంతి గా పేరుపొందిన కొఠారు సత్యనారాయణ చౌదరి (75) బుధవారం ఉదయం కన్నుమూశారు. గత నాలుగురోజులుగా తీవ్ర జ్వరంతో ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లంగ్ ఇన్ఫెక్షన్ తో పాటు బిపి పడిపోవడంతో ఆయన కోలుకోలేకపోయారు. ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుండి స్వగ్రామం సింగరాజుపాలెంకు తరలిస్తున్నారు. ఆయనకు భార్య , కుమారుడు, కుమార్తె , మనుమలు ఉన్నారు.
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం సింగరాజు పాలెం గ్రామంలో రైతు కుటుంబంలో కొఠారు పోతురాజు అన్నపూర్ణమ్మ దంపతులకు ఆయన జన్మించారు. తాడేపల్లిగూడెం డి.ఆర్. గోయెంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఏ. చదివారు. ఒకపక్క వ్యవసాయం చేసుకుంటూనే జ్యోతిష్యంపై మక్కువతో స్వగ్రామం విడిచి వెళ్లి కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో విస్తారంగా పర్యటించారు. ఆయా రాష్ట్రాలకు చెందిన సుప్రసిద్ధ జ్యోతిష పండితుల వద్ద ఆయన జ్యోతిష్యాన్ని అభ్యసించారు.
వందలాది అరుదైన జ్యోతిష గ్రంథాలను సేకరించి అధ్యయనం చేశారు. జ్యోతిష్యం లోని “ప్రాపంచిక విషయాల జ్యోతిష్యం” విభాగంలో ఆయన ప్రత్యేక కృషి చేసారు. రాజకీయ , ఆర్థిక , పారిశ్రామిక , సినీ , క్రీడా అంశాలపై ఫలితాలను చెప్పడంలో ఆయన దిట్ట. ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు తమ సమస్యలపై కొఠారు సత్యనారాయణ చౌదరిని సంప్రదిస్తూ ఉంటారు.
2004, 2009 ఎన్నికల్లో ఖచ్చితమైన గణాంకాలతో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి విజయాన్ని ముందుగానే ఆయన చెప్పారు. వై.ఎస్. కు ప్రాణ ప్రమాదం ఉందంటూ 2009 మే నెలలో చౌదరి చేసిన హెచ్చరిక అప్పట్లో పలువురి దృష్టిని ఆకర్షించింది.
సమస్య లేదా ప్రశ్న చెప్పక ముందే ఆ వ్యక్తి వచ్చిన సమయాన్ని బట్టి ఆయా సమస్యలను , పరిష్కారాన్ని కూడా వివరించడంలో ఆయన పేరు పొందారు.ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎస్వీ సుధాకరరావుకు చిరకాలంగా సలహాదారుగా కూడా చౌదరి వ్యవహరించారు. పలు దేవస్థానాలకు కూడా సలహాదారుగా ఉన్నారు. సినీ నటులు , యువరత్న నందమూరి బాలకృష్ణకు వ్యక్తిగత జ్యోతిష్కునిగా సత్యనారాయణ చౌదరి చాలాకాలం పాటు వ్యవహరించారు.
2004 జూన్ 3 న సినీ నటుడు బాలకృష్ణ ఇంటిలో జరిగిన కాల్పుల ఘటనలో బెల్లంకొండ సురేష్ తో పాటు సత్యనారాయణ చౌదరి కూడా గాయపడ్డారు. అప్పట్లో ఈ ఉదంతం సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.