ముద్ర, భద్రాచలం :
గిరిజనులే పండించి, తయారు చేసి, సృష్టించిన అన్ని రకాల వస్తువులు ఒకేచోట లభించేలా భద్రగిరి మార్ట్ ప్రజలకు అందుబాటులోకి రావడం అభినందనీయమని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. ఇవి ప్రజలకు ఎంతగానో ఉపకరిస్తాయన్న ఆయన ఇందుకు కృషి చేసిన ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ను అభినందించారు. భద్రాచలంలో ఏర్పాటు చేసిన ఈ మార్టును గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్ట్‌లోని అటవీ ఉత్పత్తులను గవర్నర్ పరిశీలించారు. ప్రజా ఉపయోగకర అనేక అటవీ వస్తువులను ఈ మార్ట్‌లో అందుబాటులోకి తీసుకు రావడం అభినందనీయమని చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గిరిజన ఉత్పత్తులకు విస్తృత మార్కెట్‌ను కల్పించడంతోపాటు స్థానిక గిరిజన కుటుంబాలకు ఆర్థిక బలాన్ని అందించే మంచి ఆశయంతో ఏర్పాటు చేసిన ఈ మార్టును స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ట్రైబల్ మ్యూజియం వంటి వినూత్న కార్యక్రమాలతో గుర్తింపు పొందిన పీవో రాహుల్ భద్రగిరి మార్ట్ అందుబాటులోకి తేవడంతో మరో మైలు రాయిగా నిలుస్తుందని చెప్పారు. గిరిజనుల సాంప్రదాయ ఉత్పత్తులు, వారి ప్రతిభకు సరైన గుర్తింపు ఇవ్వడం, వారి జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ మార్ట్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్,భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట, శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మ, సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ మరియు ఐటీడీఏ యూనిట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.