Take a fresh look at your lifestyle.

అర్హులకే సంక్షేమ పథకాలు

  • క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలి …. జిల్లా కలెక్టర్ ఆదర్స్ సురభి

ముద్ర ప్రతినిధి, వనపర్తి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే అదేవిధంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టరు ఆదర్శ్ సురభి ఆదేశించారు.జనవరి 26 నుండి ప్రభుత్వం మంజూరు చేయనున్న ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల మంజూరు వంటి ప్రతిష్టాత్మక పథకాలు వాస్తవంగా అర్హులైన వారికే అందే విధంగా జనవరి 16 నుండి 20 వరకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో మంగళవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్ లో సంబంధిత నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సర్వే లో అర్హులైన తెల్ల రేషన్ కార్డు దరఖాస్తు దారులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా లబ్ధిదారులను గుర్తించాల్సి ఉంటుందన్నారు.

రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీ, వ్యవసాయ విస్తీర్ణాధికారులు నిర్వహించే ఈ సర్వే పకడ్బందీగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు, ప్రత్యేక మండల అధికారులను నియమించి తహశీల్దార్లు, ఎంపీడీఓ లకు సైతం బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. ప్రజాపాలన ద్వారా రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను సమగ్ర పరిశీలన అనంతరం వనపర్తి జిల్లాలో 6647 దరఖాస్తులు తుది పరిశీలనకు రావడం జరిగిందని, వీటిని జనవరి 16 నుండి 20 వ తేది వరకు జరిగే సర్వేలో నిర్ధారించి తదుపరి 21 నుండి 24 వరకు జరిగే గ్రామసభల ద్వారా తీర్మానం చేయాల్సి ఉంటుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ళకై 142075 మంది దరఖాస్తు చేసుకోగా ఇంటింటి సర్వే అనంతరం వనపర్తి జిల్లాలో 36206 దరఖాస్తులు తుది జాబితాలో వచ్చాయని, తుది జాబితాలో వచ్చిన దరఖాస్తు దారుల వివరాలను జనవరి 16 నుండి 20 వరకు జరిగే క్షేత్ర స్థాయి సర్వేలో మరోమారు పరిశీలించి గ్రామ సభలో పెట్టాల్సి ఉంటుందని సూచించారు. వ్యవసాయ భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఏడాదికి 12 వేల రూపాయలు ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొరకు జిల్లాలో 121844 జాబ్ కార్డు కలిగి ఉండగా 2023-24 సంవత్సరంలో కనీసం 25 రోజులు ఉపాధిహామీ పథకంలో పని చేసి ఉండి కుంట భూమి లేని కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12 వెలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది.

వనపర్తి జిల్లాలో ఇలాంటి కుటుంబాలు 49,354 ఉన్నట్లు రాష్ట్ర నివేదికలో గుర్తించడం జరిగిందని, ఈ నాలుగురోజుల సర్వేలో అర్హత ఉన్న లబ్ధిదారులను గుర్తించాల్సి ఉంటుందన్నారు. వ్యవసాయ యోగ్యత కలిగిన భూములను గుర్తించి రైతు భరోసా ఇచ్చేందుకు మార్గదర్శకాలు ఇచ్చిన నేపథ్యంలో జనవరి 16 నుండి 20 వరకు జరిగే సర్వేలో వ్యవసాయ యోగ్యం లేని భూములు ఇళ్ల స్థలాలు, లే అవుట్లు, భూసేకరణ చేసిన స్థలాలు, ఎండోమెంట్ భూములు వంటివి గుర్తించి నివేదికను ఆన్లైన్ లో నమోదు చేయాల్సి ఉంటుందని తెలియజేశారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, ఆర్డీఓ సుబ్రమణ్యం, రైతు భరోసా నోడల్ అధికారి గోవింద్ నాయక్, రేషన్ కార్డుల నోడల్ అధికారి కాశి విశ్వనాథ్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నోడల్ అధికారి ఉమాదేవి, ఇందిరమ్మ ఇళ్లు నోడల్ అధికారి విటోబా, జడ్పి సి. ఈ ఓ యాదయ్య, డి.పి. ఒ సురేష్, కొత్తకోట మున్సిపల్ కమిషనర్ పవన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.